సిఎఎ అత్యంత ప్రమాదకరం – సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు

– ఒంగోలులో వామపక్ష, లౌకిక పార్టీల నిరసన ప్రదర్శన
ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌ :పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) అమలు దేశానికి అత్యంత ప్రమాదకరమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ మత దురహంకార విధానాన్ని దేశ ప్రజలందరూ ముక్త కంఠంతో ఖండించాలని కోరారు. రాజ్యాంగ స్ఫూర్తికి తిలోదకాలిచ్చి బిజెపి ప్రభుత్వం సిఎఎ వంటి నిరంకుశ చట్టాన్ని చేయడాన్ని వ్యతిరేకిస్తూ ప్రకాశం జిల్లా ఒంగోలులో వామపక్ష, లౌకిక పార్టీల ఆధ్వర్యంలో శనివారం నిరసన ప్రదర్శన జరిగింది. ఒంగోలు పాత మార్కెట్‌ సెంటర్‌లోని మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ విగ్రహానికి వి.శ్రీనివాసరావు పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి ప్రారంభమైన ప్రదర్శన ఒంగోలు కలెక్టరేట్‌ వరకు సాగింది. అనంతరం జరిగిన కార్యక్రమానికి సిపిఎం నగర కార్యదర్శి జి.రమేష్‌ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశంలో 2014 ముందు పక్క దేశాల వచ్చిన ముస్లిములు, హిందువులు, బుద్ధులు, క్రిస్టియన్లు ఎవరికైనా ఒకటే నిబంధన ఉండాలే తప్ప, ముస్లిములకు పౌరసత్వం ఇవ్వబోమని చెప్పడం సరికాదన్నారు. దేశంలోని ముస్లిములు కూడా ఏ దేశస్తులో నిరూపించుకున్న తరువాతే పౌరసత్వం ఖరారు చేస్తామంటే రెండో తరగతి పౌరులుగా బతకాల్సిన పరిస్థితి వారికి వస్తుందని తెలిపారు. ఇది పాకిస్తాన్‌ కాదని, భారత దేశమని, పాకిస్తాన్‌లా మత రాజ్యంగా మారుస్తామంటే చూస్తూ ఊరుకోబోమని అన్నారు. మనది లౌకిక రాజ్యమని, అందరికీ మత స్వేచ్ఛ ఉందని తెలిపారు. అన్ని మతాలనూ సమానంగా రాజ్యాంగం గౌరవిస్తోందన్నారు. మనదేశం నుంచి అమెరికాకు లక్షలాది మంది వలస వెళ్తున్నారని, వారిలో క్రైస్తవులకు మాత్రమే పౌరసత్వం ఇస్తామని, మిగిలిన వారికి ఇవ్వబోమని ఆ దేశం చెబితే ఎలా ఉంటుందో… మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానం ఆ విధంగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అధికార పార్టీ వైసిపి, ప్రతిపక్ష టిడిపి సిఎఎకు అనుకూలంగా ఓట్లు వేసి ఇప్పుడు ముస్లిముల హక్కులు కాపాడుతామని హామీలు గుప్పిస్తున్నాయని విమర్శించారు. సిఎఎకు వ్యతిరేకంగా పార్లమెంట్లో ఇండియా వేదిక బిల్లు పెట్టనుందని, బలపరుస్తాయో, వ్యతిరేకిస్తాయో వైసిపి, టిడిపి స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. లౌకిక పార్టీలని చెప్పుకుంటూ ఒక పార్టీ బిజెపితో కలిసిందని, మరో పార్టీ లంగిపోయిందని విమర్శించారు. పొత్తులు, తొత్తులుగా మారిన వీరు ముస్లిముల హక్కులు ఎలా పరిరక్షిస్తారో చెప్పాలని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో మతతత్వ బిజెపిని ఓడించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.ఈశ్వరయ్య, జిల్లా కార్యదర్శి ఎంఎల్‌ నారాయణ, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు ఈదా సుధాకర్‌రెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి ఎస్‌డి.హనీఫ్‌ తదితరులు ప్రసంగించారు.

➡️