హైదరాబాద్ : రూ.200ల కోసం మొదలైన చిన్న గొడవ ఓ యువకుడి జీవితాన్ని శాశ్వతంగా అంధకారంలోకి నెట్టేసింది. ఒక్కడిపై 20 మంది దాడి చేయడంతో అతడు రెండేళ్లపాటు మంచాన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఉప్పర్ పల్లిలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..
2022 జులై 31వ తేదీ.. రాత్రి 11 గంటలకు వివేక్‌రెడ్డి అనే వ్యక్తి.. హైదరాబాద్‌లో బీఎన్‌రెడ్డినగర్ నుంచి రాజేంద్రనగర్ సమీపంలోని ఉప్పర్‌పల్లికి క్యాబ్ బుక్ చేసుకున్నాడు. గమ్యం చేరుకున్నాక.. ఛార్జి రూ.900 అయ్యిందని క్యాబ్ డ్రైవర్ వెంకటేష్‌గౌడ్ (27) చెప్పగా.. వివేక్‌రెడ్డి రూ.700 మాత్రమే ఇచ్చాడు. మిగిలిన రూ. 200 కోసం ఇద్దరికీ వాగ్వివాదం మొదలైంది. వివేక్‌రెడ్డి తన స్నేహితులకు ఫోన్ చేసి రప్పించాడు. సుమారు 20 మంది వచ్చి, వెంకటేశ్‌గౌడ్‌ను క్రికెట్ బ్యాట్లు, వికెట్లతో చితకబాది.. బంగారు గొలుసు చోరీ చేయబోయాడంటూ వెంకటేష్‌ను రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించారు. ఆ మర్నాడు ఉదయం 6 గంటలకు వెంకటేష్ పరిస్థితి విషమించడంతో పోలీసులు అప్పుడు ఆసుపత్రికి పంపించారు. అక్కడికి తరలించిన కొద్దిసేపటికే బాధితుడు కోమాలోకి వెళ్లాడు. ఆస్పత్రిలో రెండేళ్లుగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు.
