- భాషను బలవంతంగా రుద్దుతారనడాన్ని నమ్మను
- ఎన్‌డిఎకు బేషరతుగా మద్దతు
- ఇండియా టుడే కాంక్లేవ్‌లో మంత్రి నారా లోకేష్
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ ఎల్లప్పుడూ దేశ ప్రగతికి దోహదపడుతుందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. శనివారం నాడిక్కడ ఇండియా టుడే కాంక్లేవ్‌లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రెడ్ బుక్‌ను నిర్వహిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో తెలుగును ప్రమోట్ చేస్తున్నామని, స్థానిక భాష తెలుగు అని పేర్కొన్నారు. భాషను బలవంతంగా రుద్దుతారని చెప్పడాన్ని తాను నమ్మనని అన్నారు. వివిధ భాషలు నేర్చుకోవడం అవసరమని అన్నారు. వైసిపి పాలనలో ఇసుక అక్రమ మైనింగ్ జరిగిందని, సుప్రీంకోర్టులో కేసు కూడా నడుస్తుందని తెలిపారు. ఎన్‌డిఎకు బేషరతుగా మద్దతు ఇస్తున్నామని చెప్పారు. శాసనసభలో ప్రతిపక్ష హోదా ఉండాలంటే మొత్తం సభ సంఖ్యాబలంలో పదిశాతం ఉండాలని అన్నారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిని తానని చెప్పారు. పార్లమెంట్, శాసనసభలో ఉండే నిబంధనలను తాము ఎలా ఉల్లంఘిస్తామని ప్రశ్నించారు. ప్రపంచ భాషలు నేర్చుకోవడంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వివరించారు. జర్మనీ, జపాన్ భాషలను నర్సింగ్ వృత్తిలో ఉండే వారికి నేర్పిస్తున్నామని, అందువల్ల వారికి ఆయా దేశాల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. పిల్లలకు ఏది ఇష్టమో అది నేర్చుకునే అవకాశాలు ఇవ్వాలని పేర్కొన్నారు. విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మనమిత్ర పథకంతో వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. కుల ధ్రువీకరణ పత్రాలు, హాల్ టికెట్లు, ఇతర పత్రాలు, ల్యాండ్ రికార్డులను ఈజీగా వాట్సాప్ సేవలో పొందవచ్చని అన్నారు. టాటా పవర్‌తో 7 గిగా వాట్స్ ఒప్పందం జరిగిందని అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఎఐ)కు అందరూ సిద్ధంగా ఉండాలన్నారు. విద్యా శాఖ కావాలని తాను ఎంచుకున్నానని, దానిలో బలమైన టీచర్స్ యూనియన్లు ఉన్నాయని గుర్తుచేశారు. తన భార్య తన క్రెడిట్ కార్డు బిల్లు చెల్లిస్తోందని చెప్పారు. మహిళా దినోత్సవం ఒక్క రోజు మాత్రమే కాదు, ప్రతిరోజూ జరుపుకోవాలని అన్నారు. ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ ఇండియా గెలుస్తుందని మంత్రి నారా లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.