ప్రజాశక్తి – తాడేపల్లి రూరల్ (గుంటూరు జిల్లా) : కాల్‌మనీ వ్యాపారుల ఒత్తిళ్లు తాళలేక ఆత్మహత్యాయత్నం చేసిన కూరగాయల వ్యాపారి సోమవారం మృతి చెందారు. మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు… గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఉండవల్లికి చెందిన యండ్రపల్లి ఆంజనేయులు (38) తన వ్యాపారం నిమిత్తం నలుగురి వద్ద రూ.30 లక్షల వరకు అప్పు చేశారు. వీటి మీద వడ్డీలు చెల్లిస్తున్నా ఇంకా చెల్లించాలంటూ వడ్డీ వ్యాపారులు ఒత్తిడి చేస్తుండడంతో వేధింపులు తాళలేక ఐదు రోజుల కిందట ఆంజనేయులు సెల్ఫీ వీడియో విడుదల చేశారు. అనంతరం పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నం చేశారు. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆయన చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
