ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి : ఏలూరులో కాల్‌మనీ సామాన్య ప్రజానీకాన్ని పీల్చిపిప్పిచేస్తోంది. వారి బాధలు తట్టుకోలేక ఎమ్మెల్యే బడేటి చంటిని, పోలీసులను బాధితులు సోమవారం ఆశ్రయించారు. కాల్‌మనీ వ్యాపారి మేడపాటి సుధాకర్‌రెడ్డి, ఆయన అనుచరులపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల వివరాల మేరకు.. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సుధాకర్‌రెడ్డి, ఆయన అనుచరులు మహ్మద్ అఖిల్ రెహమాన్, గూడవల్లి విద్యాసాగర్, రాజేష్, లావణ్య కాల్‌మనీ పేరుతో వేధిస్తున్నారు. రూ.25 వేలు అప్పు తీసుకుంటే వారానికి రూ.వెయ్యి వడ్డీ కట్టాలని, మంగళవారం సాయంత్రం ఏడు గంటలలోపు వడ్డీ కట్టకపోతే రెట్టింపు సొమ్ము కట్టాల్సి ఉంటుందని, ఎదురు ప్రశ్నించినా, వడ్డీ కట్టకపోయినా ఇంటికి వచ్చి భార్యను, పిల్లలను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని ఎస్‌పికి ఇచ్చిన ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు. 2019లో రూ.70 వేలు అప్పు తీసుకుని ఇప్పటి వరకూ రూ.12 లక్షలు కట్టానని చెబుతూ మైలవరపు నాగేశ్వర శర్మ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. కాల్‌మనీ బాధితులంతా ఆదివార రాత్రి ఎమ్మెల్యే బడేటిని చంటి కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. సోమవారం బాధితులతో కలిసి ఎస్‌పి ప్రతాప్ శివకిషోర్‌ను కలిసి ఫిర్యాదు చేయించారు. దాదాపు 30 మంది బాధితులు ఎస్‌పిని కలిసిన వారిలో ఉన్నారు.