CPM: ‘జిపిఎస్‌’ గెజిట్‌ను రద్దు చేయండి

పాత పెన్షన్‌ను పునరుద్దరించాలి
సిపిఎం విస్తృత సమావేశంలో తీర్మానం
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : జిపిఎస్‌ అమలు కోసం జారీ చేసిన గెజిట్‌ను రద్దు చేయాలని, పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని సిపిఎం విస్తృత సమావేశం తీర్మానించింది. రెండు రోజుల పాటు వడ్డేశ్వరంలో జరిగిన విస్తృత సమావేశంలో ఈ తీర్మానాన్ని ఆమోదించారు. సిపిఎస్‌ స్థానంలో జిపిఎస్‌ని అమలు చేస్తామని గత ప్రభుత్వం ప్రకటించిందని, ఈ జిపిఎస్‌ విధానాన్ని అంగీకరించబోమని ఉద్యోగ ఉపాధ్యాయులు ముక్తకంఠంతో వ్యతిరేకించి నిరసనలు, పోరాటాలు చేశాయని తీర్మానంలో పేర్కొన్నారు. ఎన్నికల ముందే తయారు చేసిన గెజిట్‌ని జూలై 12, 2024న విడుదల చేయడంలో మర్మమేమిటన్నది ఇప్పటి ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. సిపిఎస్‌, జిపిఎస్‌లు పాత పెన్షన్‌కి సాటిరావని, ఈ స్కీమ్‌లు కార్పొరేట్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు మాత్రమే లాభమని, ఉద్యోగులు పోరాటాల ద్వారా సాధించుకున్న సామాజిక భద్రత ఇచ్చే పాత పెన్షన్‌ రద్దు చేసి, కార్పొరేట్లకు లాభాలను చేకూర్చే జిపిఎస్‌ విధానం తీసుకురావడం సరికాదని తీర్మానంలో పేర్కొన్నారు. ఉద్యోగుల జీతం నుండి 10 శాతం కంట్రిబ్యూషన్‌ కట్టించుకొనే ఏ స్కీమ్‌ అయినా రాజ్యాంగ హక్కులకు వ్యతిరేకమని తెలిపారు. 2023 అక్టోబర్‌ నుంచే జిపిఎస్‌ అమలు చేస్తామని పాత డేట్‌తో ఇప్పుడు గెజిట్‌ను విడుదల చేయడం ఉద్యోగులను మోసం చేయడమేనని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం జిపిఎస్‌ కోసం విడుదల చేసిన గెజిట్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. సిపిఎస్‌, జిపిఎస్‌ రద్దుకోసం, పాత పెన్షన్‌ పునరుద్దరణ కోసం ఉద్యోగులు, ఉపాధ్యాయులు చేసి పోరాటాలకు సంపూర్ఠ మద్దతు తెలపడంతోపాటు, ప్రత్యక్షంగా పోరాటాల్లో పాల్గొంటామని తీర్మానంలో సిపిఎం పేర్కొంది. ఈ తీర్మానాన్ని ఎన్‌విరావు ప్రవేశపెట్టారు.

అసభ్య వీడియోలు, చిత్రాలను నియంత్రించాలి
అసభ్య వీడియోలు, చిత్రాలను సోషల్‌ మీడియాలో నియంత్రించాలని, యూట్యూబ్‌ ట్రోలర్స్‌పై చర్యలు తీసుకోవాలని సమావేశం తీర్మానించింది. తక్కువ సమయంలో ఎక్కువ మంది ప్రజలను ప్రభావితం చేసే సాధనంగా సోషల్‌ మీడియా ముందుకు వచ్చిందని, చదువు, వయస్సు లింగ బేధం లేకుండా సోషల్‌ మీడియాను వినియోగించే వారి సంఖ్య దేశవ్యాప్తంగా పెరిగిందని పేర్కొన్నారు. సోషల్‌ మీడియాను మహిళలను కించపరుస్తూ సమాజంలో ఉన్న ఆధిపత్య భావజాలాన్ని, హిందూత్వ భావజాలాన్ని మహిళలపట్ల ప్రదర్శిస్తూ ట్రోల్‌ చేయడం ఈ కాలంలో పెరిగిందని పేర్కొన్నారు. సోషల్‌ మీడియాలో మహిళలను ట్రోల్‌ చేసే వీడియోలు, చిత్రాలను నియంత్రించాలని, వారిపై కఠిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాడ్‌ చేస్తూ తీర్మానంలో పేర్కొన్నారు. ఈ తీర్మానాన్ని ఆషాదీప్తి ప్రతిపాదించారు.

మద్యాన్ని, మత్తు పదార్థాలను అరికట్టాలి
రాష్ట్రంలో మద్యాన్ని, మత్తు పదార్థాలను అరికట్టాలని మరో తీర్మానంలో సిఎఎం డిమాండ్‌ చేసింది. గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మద్యాన్ని నిషేధిస్తామని చెప్పిందని, కోవిడ్‌లో షాపులను తిరిగి తెరిచిన తరువాత మద్యం పెంచుకునే విధంగా ప్రభుత్వ విధానాలు అమ్మకాలు సాగాయని పేర్కొంది. జీవితాలను నాశనం చేసే మద్యాన్ని అరికట్టి ప్రభుత్వం మద్యం షాపులను తగ్గించాలని, గంజాయి మత్తు మందులను, స్కూళ్లు, కాలేజీల్లో కూడా చిన్న పిల్లలకు అలవాటు చేస్తున్నారని తెలిపారు. మద్యం, మత్తుమందుల ప్రభావంతో పసిబిడ్డలపై అత్యాచారాలు, హత్యలు పెరుగుతున్నాయని, కుటుంబాలను, జీవితాలను నాశనం చేసే మత్తు పదార్థాలను, మద్యాన్ని అరికట్టాలని తీర్మానించారు. ఈ తీర్మానాన్ని పి.పూర్ణ ప్రతిపాదించారు.

‘సూపర్‌ 6’ ఇతర హామీల అమలుకు చర్యలు చేపట్టాలి
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సూపర్‌ సిక్స్‌, ఇతర హామీల అమలుకు వెంటనే చర్యలు చేపట్టాలని విస్తృత సమావేశం తీర్మానించింది. సూపర్‌ సిక్స్‌ తో సహా ప్రకటించిన ఉమ్మడి ప్రణాళిక హామీలు, ఇతర కారణాలతో ఎన్నికల్లో ప్రజలు పెద్ద మెజారిటీతో గెలిపించారని, సూపర్‌ సిక్స్‌ ఇతర హామీల అమలు కోసం ప్రజలు ఆశతో ఎదురుచూస్తున్నారని తీర్మానంలో పేర్కొన్నారు. ఈ తీర్మానాన్ని నాగరాజు ప్రవేశపెట్టారు.

➡️