- ఎన్‌టిఆర్ హెల్త్ వర్సిటీ
ప్రజాశక్తి- అమరావతి : అమలాపురంలోని కోనసీమ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, రీసర్చ్ ఫౌండేషన్ మెడికల్ కాలేజీ, కర్నూలులోని విశ్వభారతి మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోటా కింద పెరిగిన 75 ఎంబిబిఎస్ సీట్ల భర్తీ చేయాలనే మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేయాలని ఎన్‌టిఆర్ హెల్త్ యూనివర్సిటీ హైకోర్టులో పిటిషన్ వేసింది. కౌన్సెలింగ్ నీట్‌లో అర్హత పొందిన అర్హులతో 75 సీట్లను భర్తీ చేయాలని గతంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీనిని రద్దు చేయాలన్న వర్సిటీ పిటిషన్‌పై విచారణను వాయిదా వేయాలని ఎజి దమ్మాలపాటి శ్రీనివాస్, స్టాండింగ్ కౌన్సిల్ టివి శ్రీదేవి మంగళవారం కోరారు. ఇందుకు అనుమతిచ్చిన జస్టిస్ గుహనాథన్ నరేందర్, జస్టిస్ తూటా చంద్ర ధనశేఖర్‌లతో కూడిన డివిజన్ బెంచ్ విచారణను బుధవారానికి వాయిదా వేసింది. కోనసీమ మెడికల్ కాలేజీకి 25 సీట్లు, కర్నూలు విశ్వభారతి మెడికల్ కాలేజీకి 50 సీట్లు పెంచుతూ ఎన్‌ఎంసి ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో, స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ కింద 75 సీట్ల భర్తీకి ఎన్‌టిఆర్ హెల్త్ వర్సిటీ కేటాయింపులు అన్యాయమంటూ ఆ కాలేజీల్లో ఎంబిడిఎస్, బిడిఎస్ కోర్సుల్లో సీట్లు పొందిన నలుగురు విద్యార్థినులు హైకోర్టులో సవాలు చేశారు. వర్సిటీ నిర్ణయం ప్రకారం భర్తీ చేస్తే తమ కంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్లతో సీట్ల భర్తీ జరుగుతుందని పిటిషనర్ల వాదన.