‘ట్రూ అప్‌’ రద్దు చేయండి

  • ఇఆర్‌సికి వామపక్షాల రాయబారం..
  • బహిరంగ విచారణలో పార్టీలు, నిపుణులు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఎపిఇఆర్‌సి) మంగళవారం నిర్వహించిన బహిరంగ విచారణ సందర్భంగా ప్రజలకు పెనుభారంగా మారుతున్న ట్రూ అప్‌ ఛార్జీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఇఆర్‌సి వద్దకు రాయబారం నిర్వహించిన వామపక్ష పార్టీలు తక్షణం ట్రూ అప్‌ ఛార్జీలను రద్దుచేయాలని డిమాండ్‌ చేశాయి. దీంతో పాటు సెకి ఒప్పందాన్ని రద్దు చేయాలని, ఎపిఇఆర్‌సి ప్రజల తరపున నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరాయి. ఈ మేరకు వామపక్షాల నేతలు ఇఆర్‌సి ఛైర్మన్‌ ఠాగూర్‌ రామ్‌సింగ్‌కు వినతిపత్రం అందజేశారు. ఇఆర్‌సి నిర్వహించిన విచారణలో పాల్గొన్న వివిధ పార్టీల నేతలు, విద్యుత్‌ రంగ నిపుణులు కూడా ఈ అంశంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలపై మోపుతున్న భారాలను రద్దు చేయాలని డిమాండ్‌చేశారు. తొలుత వామపక్ష పార్టీలు విజయవాడలోని ఒక ప్రైవేటు హాలులో బహిరంగ విచారణ జరుపుతున్న ఎపి ఇఆర్‌సి ఛైర్మన్‌ వద్దక రాయబారం నిర్వహించాయి. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ అదాని లాభాలకు గ్యారంటీలు ఇవ్వడమే లక్ష్యంగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని అన్నారు. గత ప్రభుత్వం టిడిపి పేరు చెప్పి ప్రజలపై భారాలు మోపితే, ప్రస్తుత ప్రభుత్వం వైసిపి పేరుచెప్పి అదే పని చేస్తోందన్నారు. ఫలితంగా ప్రజలపై వేల కోట్ల రూపాయల భారం పడుతోందన్నారు. విద్యుత్‌ ఛార్జీలపై కూటమి ప్రభుత్వం మాటతప్పిందని తెలిపారు. ఎన్నికల్లో విద్యుత్‌ చార్జీలు పెంచేది లేదని అవసరమైతే తగ్గిస్తామని చెప్పి, ఈ ఆరు నెలల్లోనే ట్రూ అప్‌, సర్వీసు చార్జీల పేరుతో రూ.16వేల కోట్లు అదనపు భారం వేసిందన్నారు. ఇది చాలదన్నట్లు ఈ ఏడాదికి మరో రూ.5,900 కోట్ల లోటు చూపిస్తుందని చెప్పారు. ఈ లోటును ప్రభుత్వం భరించేందుకు సిద్ధంగా లేదన్నారు. దీంతో ఈ భారం వచ్చే ఏడాది వినియోగదారులపై పడనుందన్నారు. రూ.1,750 కోట్లు లంచాలు తీసుకుని యూనిట్‌ 2.49 కొనుగోలు చేసేందుకు గత ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటే, ఈ ప్రభుత్వం కనీసం విచారణ చేయడం లేదన్నారు. స్మార్ట్‌ మీటర్లు, విద్యుత్తు చార్జీలు ఉపసంహరించుకోవడంతో పాటు సెకి ఒప్పందాన్ని రద్దు చేసే వరకూ ఉద్యమం ఆగదన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ ఇఆర్‌సి ఏనాడు ప్రజల ప్రయోజనాలు కాపాడలేదన్నారు. వేల కోట్లు ఖర్చు చేసి స్మార్ట్‌ మీటర్లు బిగించాలని ఎవరు కోరారని ప్రశ్నించారు. అసెంబ్లీలో అదానీ పేరు ప్రస్తావిచేందుకే సిఎం బయపడుతున్నారని చెప్పారు. సిపిఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసి కార్యదర్శివర్గ సభ్యులు పి.ప్రసాద్‌ మాట్లాడుతూ అవినీతి లక్ష్యంగా జరిగిన విద్యుత్‌ ఒప్పందాలు వల్ల ప్రజలపై పడే భారాన్ని నివారించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్‌ మాట్లాడుతూ… ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజలను మభ్యపెట్టేందుకు ఎపిఇఆర్‌సి ప్రయత్నిస్తోందన్నారు. అనంతరం ప్రజల నుంచి వేలాదిగా సేకరించిన అభ్యంతరాలను ఎపిఇఆర్‌సి ఛైర్మన్‌ ఠాగూర్‌ రామ్‌సింగ్‌కు వి శ్రీనివాసరావు, రామకృష్ణ, ఇతర వామపక్ష పార్టీల నాయకులు అందజేశారు. కార్యక్రమంలో సిపిఎం రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ బాబూరావు, ఎన్‌టిఆర్‌ జిల్లా కార్యదర్శి డివి కృష్ణ, విజయవాడ తూర్పు, పశ్చిమ కార్యదర్శులు కె. కృష్ణ, బి. రమణరావు, బి.సత్యబాబు, నాయకులు వై.కేశవరావు, ఎం.హరిబాబు, ఆండ్ర మాల్యాద్రి, సిపిఐ నాయకులు వీరభద్రరావు, పి.దుర్గాభవాని తదితరులు పాల్గొన్నారు.

➡️