- మార్చి నాటికి ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి
- మచిలీపట్నం వైద్య కళాశాలకు పింగళి వెంకయ్య పేరు
- వచ్చే ఏడాది అక్టోబర్ నాటికి బందరు పోర్టు పూర్తి : సిఎం చంద్రబాబు
ప్రజాశక్తి- కలెక్టరేట్ (కృష్ణా) : రాష్ట్రంలో గత ప్రభుత్వం విధించిన చెత్త పన్ను రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. వచ్చే మార్చి నాటికి మరుగుదొడ్లు లేని ఇళ్లకు మరుగుదొడ్లు నిర్మిస్తామన్నారు. మచిలీపట్నం వైద్య కళాశాలకు పింగళి వెంకయ్య పేరు పెడతామని తెలిపారు. బందరు పోర్టును వచ్చే ఏడాది అక్టోబర్ నాటికి పూర్తి చేస్తామన్నారు. కృష్ణా జిల్లాలో బుధవారం ఆయన పర్యటించారు. జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మచిలీపట్నం ఎజె కళాశాల ఆవరణలో జరిగిన ‘స్వచ్ఛతా హి సేవా’ కార్యక్రమంలో గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పారిశుధ్య కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి రోడ్డు ఊడ్చారు. మచిలీపట్నంలోని డంపింగ్ యార్డ్‌ను పరిశీలించారు. కోనేరు సెంటర్ వద్ద డివైడర్లకు రంగులు వేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. బందరు పోర్టు నిర్మాణ పనులను పరిశీలించారు. టిటిడి కల్యాణ మండపంలో నిర్వహించిన ప్రజావేదిక సభలో, ఎజె కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు చెత్త పన్నును రద్దు చేస్తూ వచ్చే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇకపై రాష్ట్రంలో ఏ మున్సిపాల్టీలోనూ చెత్త పన్ను వసూలు చేయొద్దని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం చెత్తపై పన్ను వేసింది తప్ప, చెత్తను సరిగా తొలగించలేదన్నారు. రాష్ట్రంలో 85 లక్షల టన్నులకుపైగా చెత్త పేరుకుపోయిందని, దీనిని ఏడాదిలో తొలగించాలని మంత్రి నారాయణను ఆదేశించామని తెలిపారు. చెత్త నుండి విద్యుత్తును ఉత్పత్తి చేసే ప్లాంట్లు మరిన్ని ఏర్పాటు చేస్తామన్నారు. 2025 నాటికి ప్రతి గ్రామంలో ఘన వ్యర్థాల ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని, 2027 నాటికి ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా సురక్షిత తాగు నీరు అందిస్తామని, 2029 నాటికి అవసరమైన చోట వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మచిలీపట్నం-రేపల్లె రైల్వే లైన్‌కు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పి.నారాయణ, కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథి, బందరు ఎంపి వల్లభనేని బాలశౌరి, ఏలూరు రేంజ్ ఐజి అశోక్ కుమార్, కలెక్టర్ డికె.బాలాజీ, ఆర్‌టిసి చైర్మన్ కొనకళ్ల నారాయణ, పలువురు ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు పాల్గొన్నారు.
ఆంధ్ర జాతీయ కళాశాలను స్వాధీనం చేసుకుంటాం
ఆంధ్ర జాతీయ కళాశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అభివృద్ధి చేయనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఆ కళాశాలను పరిరక్షిస్తామని ప్రకటించారు. ఆ కళాశాలకు ఉన్న 300 ఎకరాలను ప్రభుత్వం ఏ విధంగా సద్వినియోగించుకోవాలో పరిశీలిస్తామన్నారు. ఆంధ్ర జాతీయ కళాశాలను, దాని అనుబంధ సంస్థలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రికి ఆంధ్ర జాతీయ విద్యా పరిషత్ పరిరక్షణ సమితి తొలుత వినతిపత్రం ఇచ్చింది.