విశాఖపట్నం : విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విజయవాడకు రెండు సర్వీసులు ఇప్పటికే నిలిచిపోగా.. మే లో బ్యాంకాక్ (థారులాండ్), కౌలాలంపూర్ (మలేసియా) సర్వీసులూ రద్దు కానున్నాయి. కోవిడ్ సమయంలో నిలిచిపోయిన దుబాయి సర్వీసు ప్రారంభం కాకపోగా, ఉన్నవీ రద్దవడంతో స్థానిక పారిశ్రామికవేత్తలు, నాయకులు, వివిధ వర్గాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు దృష్టి సారించాలని కోరుతున్నారు. విశాఖ విమానాశ్రయం నుంచి బ్యాంకాక్, కౌలాలంపూర్‌లకు నేరుగా విమాన సర్వీసులు గతేడాది ఏప్రిల్‌లో ప్రారంభమయ్యాయి. వారంలో మూడేసి రోజులు ఆయా ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. కంబోడియా, చైనా, హాంకాంగ్, ఇండోనేసియా, జపాన్, లావోస్, మకావ్, ఫిలిప్పీన్స్, తైవాన్, వియత్నాం, ఆస్ట్రేలియా తదితర దేశాలకు వెళ్లేవారికి ప్రయోజనం కలుగుతుంది. ఆక్యుపెన్సీ తక్కువగా ఉన్న కారణంగా జనవరిలో కౌలాలంపూర్ సర్వీసును నిలిపివేయాలని ఆ సంస్థ భావించగా.. కేంద్ర మంత్రి చొరవతో సేవలు కొనసాగించారు. గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఏడాది అదే నెలలో అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య 74.4 శాతం పెరిగింది. 8,415 మంది మలేసియా, కౌలాలంపూర్, సింగపూర్‌కు రాకపోకలు సాగించారు. తాజాగా మే మొదటి వారం నుంచి ఈ సర్వీసులకు టికెట్ల బుకింగ్ నిలిపివేశారు. ఇక్కడి నుంచి ఉమ్మడి విశాఖతోపాటు తూర్పు గోదావరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నారు. అంతర్జాతీయ సర్వీసులు నిలిచిపోతే వారంతా హైదరాబాద్, చెన్నై వెళ్లి.. అక్కడి నుంచి బ్యాంకాక్, మలేసియాలకు ప్రయాణించాలి. విశాఖ, విజయవాడ మధ్య రాకపోకలు పెరిగిన నేపథ్యంలో గతేడాది అక్టోబరులో రెండు కొత్త సర్వీసులు ప్రారంభించారు. దీంతో ప్రతిరోజు నేరుగా విజయవాడ వెళ్లేందుకు ఉదయం రెండు, సాయంత్రం ఒక సర్వీసు అందుబాటులో ఉండేవి. తాజాగా ఉదయం సర్వీసులు రద్దయ్యాయి. మిగిలిన రోజుల్లో విజయవాడకు రాకపోకలు సాగించేందుకు వందే భారత్ రైలు అందుబాటులో ఉంది. మంగళవారాల్లో వందేభారత్ కూడా లేకపోవడంతో మరింత ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ విషయాన్ని ఏపీ విమాన ప్రయాణికుల సంఘం ప్రతినిధులు విజరుమోహన్, నరేశ్‌కుమార్.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
