గంజాయి, డ్రగ్స్‌ నియంత్రణకు ‘ఈగిల్‌’

  • ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్‌ నియంత్రణ కోసం ‘ఎలైట్‌ యాంటీ నార్కోటిక్స్‌ గ్రూప్‌ ఫర్‌ లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ఈగిల్‌)ను ఏర్పాటుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని అమరావతిలో కేంద్ర కార్యాలయం, జిల్లాల్లో యూనిట్‌ కార్యాలయాలు ఏర్పాటు చేస్తూ జిఓ 145ను హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ గురువారం విడుదల చేశారు. గంజాయి, డ్రగ్స్‌, సరఫరా, రవాణా నియంత్రణ, నేరాల దర్యాప్తు, విచారణపై ఈగిల్‌ కార్యాచరణ చేపట్టనుంది. ఇందులో పనిచేసేందుకు సిబ్బందిని డిప్యూటేషన్‌పై తీసుకోవాలని ప్రభుత్వం పేర్కొంది. ఈ ఫోర్స్‌కు ముందుగా రూ.8.59 కోట్లు కేటాయించింది. గంజాయి, డ్రగ్స్‌ వ్యవహారాల్లో విచారణకు ఐదు ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, తిరుపతిలో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుల ఏర్పాటు కోసం హైకోర్టుకు నివేదించినట్లు వెల్లడించింది.

➡️