రెండు దశల్లో రాజధాని నిర్మాణాలు సిఆర్‌డిఎ నిర్ణయం

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాజధాని పరిధిలో చేపట్టే నిర్మాణాలను రెండు దశల్లో చేయాలని సిఆర్‌డిఎ నిర్ణయించింది. దీనికి అనుగుణంగా ఈ నెలాఖరులోపు పనులు చేపట్టేలా ప్రణాళిక సిద్దం చేస్తోంది. మొత్తం పనులను సివిల్‌ వర్క్సు, ఇంటీరియర్‌గా విభజించి చేపట్టనున్నారు. సివిల్‌ పనులకు ప్లాన్లు సిద్ధమైనా ఇంకా ఇంటీరియర్‌ పనులకు ప్లాను సిద్ధం కాలేదు. ఈ ప్లాను కూడా సిద్ధం కావడానికి మరో తొమ్మిది నెలలు పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకూ ఆగితే పనులు జాప్యం అయ్యే అవకాశం ఉండటంతో సివిల్‌ పనులు చేపట్టాలని అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. ఈ పనులకు సంబంధించి ఈ నెల 18వ తేదిన టెండర్లు పిలిచిన సంగతి తెలిసిందే. బుధవారం మరో తొమ్మిది పనులకు టెండర్లు పిలిచారు. గురువారం మరో రెండు టెండర్లు పిలవనున్నారు. ఇప్పుడున్న ప్లానులో భాగంగా తొలిదశలో ఐదు సెక్రటేరియట్‌ భవనాలు, అసెంబ్లీ, హైకోర్టు భవనాలు నిర్మించనున్నారు. ఈ మూడింటికి ఇంటీరియర్‌ ప్లాను సిద్ధం కాలేదు. వీటిల్లో సెక్రటేరియట్‌ భవనాల(జిఎడి)లో ఒకటి 50 అంతస్తులు నిర్మిస్తారు. మరో నాలుగు 42 అంతస్తుల ఎత్తు వరకూ నిర్మిస్తారు. వాటికి సమాంతరంగా రోడ్ల పనులూ చేపడతామని అధికారులు చెబుతున్నారు. రెండేళ్లలో పనులన్నీ పూర్తయ్యేలా, మరో ఏడాదిలోపు సౌకర్యాల కల్పన పూర్తి చేసేలా ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే హైకోర్టు వెనుకవైపు చేపట్టిన 12 బ్లాకుల్లో నిర్మాణాలన్నీ పూర్తయితే ఇంటీరియర్‌ పూర్తి కావాల్సి ఉంది. కొత్తగా నిర్మించబోయే సివిల్‌ వర్కులతోపాటు, గతంలో నిర్మించి వదిలేసిన భవనాల్లో ఇంటీరియర్‌ పనులూ చేపట్టనున్నారు. ఉద్యోగులు, అధికారుల భవనాల్లో ఇంటీరియర్‌ కోసమే రూ.1600 కోట్ల వరకూ ఖర్చయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు.

➡️