కార్మిక వర్గంపై పెట్టుబడిదారీ వ్యవస్థ దాడి

  • సంఘటితంగా తిప్పి కొట్టాలి
  • సిఐటియు రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశంలో డాక్టర్‌ కె హేమలత
  • కేరళ బాధితులకు ఆర్థిక సాయం

ప్రజాశక్తి- నెల్లూరు : ప్రభుత్వ పాలన విధానాల వల్ల పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభంలోకి నెట్టివేయబడుతోందని, దానినుంచి బయటపడేందుకు, లాభాలను ఆర్జించేందుకు, ఆదాయాలు పెంచుకునేందుకు పెట్టుబడీదారీ వ్యవస్థ కార్మిక, శ్రమ జీవులపై దాడులకు పాల్పడుతోందని సిఐటియు ఆల్‌ ఇండియా అధ్యక్షులు డాక్టర్‌ కె.హేమలత అన్నారు. మూడు రోజుల పాటు జరిగే సిఐటియు రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశంలో భాగంగా నెల్లూరులో తొలి రోజు శుక్రవారం బహిరంగ సభ నిర్వహించిన విషయం విదితమే. రెండో రోజు శనివారం నెల్లూరులోని డాక్టర్‌ జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో జరిగిన సమావేశంలో డాక్టర్‌ కె.హేమలత మాట్లాడారు. కోల్‌కత్తాలో ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు సిఐటియు ఆల్‌ఇండియా కౌన్సిల్‌ సమావేశం విజయవంతంగా నిర్వహించుకున్నామన్నారు. దీనిలో 17వ మహాసభలో తీసుకున్న నిర్ణయాలు, దిశ, నిర్దేశాలు ఏ మేరకు అమలు చేశామో సమీక్షించుకుంటున్నట్లు తెలిపారు. ఈ కర్తవ్యాలను 18వ మహాసభ నిర్వహించుకొనేలోగా పూర్తి చేయాలని తీర్మానించుకున్నట్లు వివరించారు. దానికి అనుగుణంగా రాష్ట్రంలో నిర్వహించాల్సిన కార్యక్రమాలను ఈ కౌన్సిల్‌ సమావేశంలో సభ్యులకు తెలియజేస్తామన్నారు. అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో నెలకొంటున్న పరిస్థితులపై వివరంగా చర్చించి ఓ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. దేశం, రాష్ట్రంలో ప్రభుత్వాలు అనుసరిస్తోన్న నూతన ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా సిఐటియు ఆధ్వర్యాన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సిఐటియు వేదికగానే కాకుండా అన్ని కార్మిక సంఘాలూ, ట్రేడ్‌ యూనియన్లు, రైతు సంఘాలు, జాయింట్‌ ట్రేడ్‌ యూనియన్లను కలుపుకొని ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సిఐటియు బలోపేతం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సిహెచ్‌ నర్సింగరావు ప్రసంగించారు. ఈ సమావేశానికి సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎవి.నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. సమావేశం ప్రారంభానికి ముందు ఇటీవల మృతి చెందిన సిఐటియు, వామపక్ష పార్టీల నాయకులకు సంతాపం తెలియజేస్తూ తీర్మానాన్ని ముజ్‌ఫర్‌ అహ్మద్‌ ప్రవేశపెట్టారు. పశ్చిమబెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్‌ బట్టాచార్యకు, కేరళలోని వయనాడ్‌ మృతులకు, ఇతర నేతలకు సంతాపం ప్రకటించారు. కేరళ వరదల్లో తీవ్రంగా నష్టపోయిన బాధితులను ఆదుకోవడానికి సిఐటియు రాష్ట్ర కమిటీ రూ.5 లక్షల చెక్కును డాక్టర్‌ కె.హేమలతకు అందజేసింది. విశాఖపట్నం జిల్లా సిఐటియు నుంచి 2.50 లక్షలు, కడప జిల్లా సిఐటియు శాఖ రూ.30 వేలు, పశ్చిమగోదావరి సిఐటియు శాఖ రూ.48 వేలు, శ్రీకాకుళం జిల్లా శాఖ రూ.20 వేల చెక్కును ఆల్‌ ఇండియా సిఐటియు నాయకులకు అందించారు.

➡️