ప్రజాశక్తి – నరసాపురం : పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం తుందుర్రులో గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌పార్కు నిర్మాణానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో సిపిఎం నాయకులపై పెట్టిన కేసును నరసాపురం అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఆక్వా మెగా ఫుడ్ పార్క్ వల్ల కాలుష్యం పెరిగి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని, ఆ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఆపాలని అప్పట్లో తుందుర్రు, పరిసర గ్రామాల ప్రజలు చాలా కాలంపాటు ఉద్యమించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా ఉద్యమకారులపై పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో అప్పటి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎంపి పి.మధు, సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం, నాయకులు కవురు పెద్దిరాజు, జుత్తిగ గోపాలన్, ముచ్చర్ల త్రిమూర్తులు, దూసి కళ్యాణి, మామిడిశెట్టి రామాంజనేయులు, ఆరేటి వాసు తదితరులపై… ఫ్యాక్టరీని ధ్వంసం చేయడానికి ప్రజలను రెచ్చగొట్టారనే అభియోగంపై 2017లో పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో అభియోగాలు రుజువు కాకపోవడంతో కేసును కొట్టి వేస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు.
