తెలంగాణ : రాష్ట్రంలో వచ్చే నెల 6 వ తేదీ నుంచి కులగణన చేపట్టనున్నట్టు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. సోమవారం ఆయన సచివాలయంలో సామాజికవేత్తలు, మేధావులతో సమావేశమై కులగణనలో చేయాల్సిన మార్పులు, చేర్పులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. కులగణనకు సంబంధించి దిశానిర్దేశం చేయడానికి కలెక్టర్లతో మంగళవారం కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 300 మంది సామాజికవేత్తలు, మేధావులు, అభ్యుదయవాదులతో సమావేశం నిర్వహించి అభిప్రాయాలు, సందేశాలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. వీరితోపాటు కులసంఘాలు, యువజన సంఘాలను పిలిచి వారి అభిప్రాయాలు తీసుకుంటామని తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఇతర భాగస్వాముల అభిప్రాయాలను సేకరిస్తామని వివరించారు. ఇప్పటికే నాలుగు జిల్లాల్లో 56 ఇండ్లను పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని కులగణన సర్వే పూర్తి చేసినట్టు తెలిపారు. సమావేశంలో మంత్రి పొన్నం, ఎమ్మెల్సీ కోదండరాం, తదితరులు పాల్గొన్నారు.