అధికారంలోకి రాగానే కులగణన

Mar 31,2024 22:15 #karnool, #Nara Chandrababu, #speech

– ఇంటి దగ్గరకే రూ.4వేల పింఛన్‌
– రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు
– ప్రజాగళం సభల్లో చంద్రబాబు
ప్రజాశక్తి – కర్నూలు ప్రతినిధి/ మార్కాపురం (ప్రకాశం జిల్లా) :అధికారంలోకి రాగానే చట్టపరంగా కులగణన చేపడతామని టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు, ప్రకాశం జిల్లా మార్కాపురంలో ప్రజాగళం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే పింఛను రూ.4 వేలు ఇస్తామని, ఇంటికే తీసుకొచ్చి అందిస్తామని, బిసిలకు 50 ఏళ్లకే పింఛన్‌ ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే బిజెపితో పొత్తు పెట్టుకున్నామన్నారు. రాబోయే ఐదేళ్లలో ప్రజల రుణం తీర్చుకుంటామని తెలిపారు. బిజెపితో తాత్కాలిక పొత్తు అంటూ నా పేరుతో ఫేక్‌ లెటర్‌ రాసి సోషల్‌ మీడియాలో వైసిపి నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని, ధైర్యం ఉంటే ముందుకొచ్చి మాట్లాడాలని సవాల్‌ విసిరారు. వైసిపి హయాంలో రాయలసీమలో 102 ప్రాజెక్టులు రద్దు చేశారని విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి సీమ దిశను మారుస్తామని హామీ ఇచ్చారు. రాయలసీమకు అన్యాయం చేసిన జగన్‌కు ఓటు వేస్తే మన నెత్తిన మనమే చెత్త వేసుకున్నట్లేనని పేర్కొన్నారు. ఆదరణ పథకాన్ని మళ్లీ తీసుకొస్తామని, రూ.5 వేల కోట్లతో ఆధునిక పనిముట్లు ఇస్తామని, విదేశీ విద్యా దీవెన, చంద్రన్న బీమాను పునరుద్దరిస్తామని తెలిపారు. శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు అందజేస్తామన్నారు. చేనేతలకు 200 యూనిట్లు, పవర్‌ లూముకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్‌ ఇస్తామని స్పష్టం చేశారు. చేనేతలకు ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని, టెక్స్‌టైల్‌ పార్క్‌ తీసుకొస్తామని హామీ ఇచ్చారు. రెండుసార్లు ఎన్‌డిఎతో ఉన్నా ముస్లింలకు అన్యాయం జరగకుండా హక్కులను కాపాడిన పార్టీ తెలుగుదేశమని తెలిపారు. బుడగ జంగాలను, కురుబలను ఎస్‌సిల్లో, బోయలను ఎస్‌టిల్లో చేర్చేందుకు టిడిపి కట్టుబడి ఉందన్నారు. మాదిగలకు న్యాయం జరగాలని, జిల్లాల వారీగా వర్గీకరణ తీసుకొస్తామని హామీ ఇచ్చారు. గోదావరి నీళ్లు రాయలసీమకు తీసుకొస్తామని, ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
జగన్‌ పాలనలో ప్రజలు భారాలు మోయలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని, ఇస్తున్న పథకాల్లో నవరత్నాలు లేవని… నవ మోసాలే ఉన్నాయని ఆరోపించారు. నవరత్నాల పేరుతో జగన్‌ బటన్‌ నొక్కుడేమోగానీ, విద్యుత్‌ ఛార్జీల పెంచేందుకు తొమ్మిది సార్లు బటన్‌ నొక్కారన్నారు. బటన్‌ నొక్కింది ఎంత? జనం దగ్గర బక్కింది ఎంత? సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా జగన్‌ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్య నిషేధం చేస్తానని గత ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక మద్యం ధరలు పెంచారన్నారు. వారంలో సిపిఎస్‌ రద్దు చేస్తామని చెప్పి మోసం చేశారని విమర్శించారు. జాబ్‌ కేలెండర్‌ ఊసే లేదన్నారు. టిడిపి అధికారంలోకి వస్తే మెగా డిఎస్‌సిపై తొలి సంతకం చేస్తామని, నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు ఆలోచించాలని, వచ్చే ఎన్నికల్లో ఎన్‌డిఎ కూటమిని గెలిపించాలని కోరారు.

➡️