రాజధానిలోని రైతు దీక్షా శిబిరాల్లో సంబరాలు

ప్రజాశక్తి – తుళ్లూరు (అమరావతి) : రాజధాని అమరావతిలో సంబరాలు అంబరాన్నంటాయి. కూటమి విజయాన్ని పురస్కరించుకుని రైతులు, మహిళలు, రైతు కూలీలు రైతు దీక్షా శిబిరాలలో స్వీట్లు పంచుకున్నారు. బాణసంచా కాల్చారు. తాము ఊహించిన దానికంటే కూడా కూటమి విజయాన్ని సాధించిందని రైతులు సంతోషం వెలిబుచ్చారు. దొండపాడు రైతు దీక్షా శిబిరంలో మాజీ ఎంపి టిసి మైనేని గిరిజ, మరికొందరు టిడిపి కార్యకర్తలు ఎన్‌టిఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. హరిశ్చంద్రపురంలో టిడిపి, జనసేన నాయకులు, కార్యకర్తలు, చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ చిత్ర పటాలను చేత పట్టుకొని నఅత్యాలు చేశారు. వడ్డమానులో యువతీ యువకులు పసుపు టోపీలు ధరించి పసుపు జల్లుకుంటూ జై బాబు..అంటూ కేరింతలు కొట్టారు. ప్రొక్లయినర్‌ పైకి ఎక్కి విజయ సూచకంగా రెండు వేళ్ళు చూపుతూ జై బాబు..బై వైసిపి అంటూ నినాదాలు చేశారు. అమరావతి ఉద్యమంతోనే వైసిపికి పుట్టగతులు లేకుండా పోయాయని మహిళా రైతులు అన్నారు. తుళ్లూరు రైతు దీక్షా శిబిరంలో బుల్లి తెర ఏర్పాటు చేసుకొని ఎన్నికల ఫలితాలను వీక్షించిన రైతులు, మహిళల కూటమి ప్రభంజనంతో పరవశించిపోయారు. ఆనందంతో రైతులు, యువకులు రోడ్డు పైకి వచ్చి పరస్పరం అభినందించుకున్నారు. వెలగపూడి, అనంతవరం, నెక్కల్లు, వెంకటపాలెం, మందడం, తదితర రైతు దీక్షా శిబిరాలలో విజయోత్సవాలు జరిగాయి. బాణసంచాలు కాల్చడం, విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదంటూ పోలీసులు చేస్తున్న హెచ్చరికలను బేఖాతరు చేస్తూ టిడిపి, జనసేన నాయకులు, కార్యకర్తలు రోడ్లపై బైక్‌ లతో కలియ తిరిగారు. దీంతో పోలీసులు గ్రామాల్లో తిరుగుతూ పోలీసు నిషేధాజ్ఞలు ఉల్లంఘించవద్దని హెచ్చరికలు చేశారు.

➡️