రామోజీరావు మృతిపట్ల ప్రముఖుల సంతాపం

Jun 8,2024 10:31 #celebrities, #death, #Ramoji Rao

తెలంగాణ : రామోజీ గ్రూప్‌ సంస్థల అధినేత రామోజీరావు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున 4 గంటల 50 నిముషాలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోడి, బిజెపి అగ్రనేత అమిత్‌ షా, తెలుగుదేశం అధినేత చంద్రబాబు, తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌, తెలుగు అగ్ర కథానాయకుడు, మెగాస్టార్‌ చిరంజీవి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సహా పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోషల్‌ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు.

ఎప్పుడూ దేశాభివృద్ధి కోసమే ఆలోచించేవారు : ప్రధాని మోడి
”శ్రీ రామోజీ రావు గారు మరణించడం చాలా బాధాకరం. భారతీయ మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడాయన. జర్నలిజం, సినీ ప్రపంచంపై చెరగని ముద్ర వేశారు. మీడియాలో రామోజీరావు సరికొత్త ప్రమాణాలను నెలకొల్పారు. ఆయన్నుండి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడు. ఆయన ఎప్పుడూ దేశాభివఅద్ధి కోసమే ఆలోచించేవారు. రామోజీరావుతో మాట్లాడే అవకాశం నాకు ఎన్నోసార్లు దక్కింది. రామోజీరావు కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి.” అని ప్రధాని మోడి ట్వీట్‌ చేశారు.

జర్నలిజం, సాహిత్యం, సినిమా, విద్యా రంగాల్లో రామోజీరావు సేవలు ఎనలేనివి : ఎపి గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌
విజయవాడ : ఈనాడు గ్రూప్‌ ఛైర్మన్‌ సిహెచ్‌.రామోజీరావు మృతి పట్ల ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. రామోజీరావు మీడియా, వినోద రంగంలో నిష్ణాతుడని, తెలుగు జర్నలిజంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పడంలో ప్రసిద్ధి చెందారని, జర్నలిజం, సాహిత్యం, సినిమా, విద్యా రంగాల్లో ఎనలేని సేవలందించినందుకుగాను రామోజీరావును పద్మవిభూషణ్‌తో సత్కరించినట్లు తెలిపారు. రామోజీరావు కుటుంబ సభ్యులకు గవర్నర్‌ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

నాకు ఒక స్ఫూర్తి : చంద్రబాబు
ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్‌ రామోజీరావు అస్తమయం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు తెలిపారు. ”ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన రామోజీరావు మరణం తీవ్ర ఆవేదనకు గురి చేసింది. అక్షర యోధుడుగా తెలుగు రాష్ట్రాలకు, దేశానికి ఎన్నో సేవలు అందించారు. తెలుగు వారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్రవేసిన రామోజీ తెలుగు ప్రజల ఆస్తి. ఆయన మరణం తెలుగు ప్రజలకే కాదు….దేశానికి కూడా తీరని లోటు. సమాజ హితం కోసం అనుక్షణం పనిచేసిన ఆయన కీర్తి అజరామరం. ఈనాడు గ్రూపు సంస్థల స్థాపనతో వేల మందికి ఉపాధి కల్పించారు. మీడియా రంగంలో శ్రీ రామోజీ గారిది ప్రత్యేకమైన శకం. ఎన్నో సవాళ్లను, సమస్యలను అధిగమించి…ఎక్కడా తలవంచకుండా విలువలతో సంస్థలను నడిపిన విధానం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయం. దశాబ్దాల తన ప్రయాణంలో అనుక్షణం ప్రజల మంచి కోసం, సమాజ హితం కోసం పనిచేశారు. మీడియా రంగంలో ఆయనొక శిఖరం, ఆయన ఇక లేరు అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాము. రామోజీరావుతో నాకు 4 దశాబ్దాల అనుబంధం ఉంది. మంచిని మంచి, చెడును చెడు అని చెప్పే ఆయన తీరు… నన్ను ఆయనకు దగ్గర చేసింది. సమస్యలపై పోరాటంలో ఆయన నాకు ఒక స్ఫూర్తి. ప్రజలకు మంచి పాలసీలు అందించే విషయంలో రామోజీ సూచనలు, సలహాలు ఎప్పుడూ ఉన్నతంగా ఉండేవి.” అని ఎక్స్‌ లో ట్వీట్‌ చేశారు.

తెలుగు పత్రికారంగంలో పెను మార్పులకు శ్రీకారం చుట్టిన వ్యక్తి రామోజీరావు : సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ
తెలంగాణ : ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు మరణం పట్ల సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ సంతాపం తెలిపారు. తెలుగు పత్రికారంగంలో పెను మార్పులకు శ్రీకారం చుట్టిన వ్యక్తి రామోజీరావు అని అన్నారు. ఆసియాలోనే అతిపెద్ద రామోజీ ఫిలిం సిటీ నిర్మించిన ఘనత ఆయనదేనన్నారు. రామోజీరావు ఎంచుకున్న ప్రతి రంగంలో విశిష్ట ప్రతిభ కనబరిచారని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నామన్నారు.

అక్షర యోధుడు రామోజీరావు : పవన్‌ కల్యాణ్‌
అక్షరానికి సామాజిక బాధ్యత ఉందని రామోజీరావు నిరూపించారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కొనియాడారు. అక్షరయోధుడు రామోజీరావు తుదిశ్వాస విడిచారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానంటూ ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. రామోజీరావు ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించారు. రామోజీరావు స్థాపించిన ఈనాడు పత్రిక భారతీయ పత్రికా రంగంలో పెను సంచలనమేనని కొనియాడారు. ప్రజా పక్షం వహిస్తూ వాస్తవాలను వెల్లడిస్తూ, జన చైతన్యాన్ని కలిగించారని కీర్తించారు. ప్రజా ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలిచారని గుర్తుచేశారు. రామోజీ ఫిల్మ్‌ సిటీ నిర్మాణంతో భారతీయ చిత్ర పరిశ్రమకు హైదరాబాద్‌ను వేదికగా చేశారన్నారు.

జనహితమే తన అభిమతం : లోకేశ్‌
రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు గారి మఅతి తెలుగు సమాజానికి తీరని లోటు. ప్రజా పక్షపాతి, అలుపెరుగని అక్షర యోధుడికి కన్నీటి నివాళులు అర్పిస్తున్నాను. జనహితమే తన అభిమతంగా జీవితాంతం నిబద్ధతతో పనిచేసిన రామోజీరావు గారు మనకు మార్గదర్శి. ప్రజాస్వామ్య పరిరక్షణకు రామోజీరావు ఉద్యమస్ఫూర్తితో పని చేశారు. – టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌

రామోజీరావు మృతి బాధాకరం : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు
తెలంగాణ : రామోజీ గ్రూప్‌ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి స్వయంకఅషితో కష్టపడి అంచలంచెలుగా ఎదిగిన వ్యక్తి రామోజీరావు. ఈనాడు దినపత్రిక స్థాపించి తెలుగు పత్రికా ప్రపంచంలో నవ శకానికి నాంది పలికారు. ఈనాడు మీడియా సంస్థ ద్వారా నిజాలను నిర్భయంగా ప్రసారం చేసి సమాజాన్ని చైతన్యం చేశారు. ఈనాడు ముందడుగు ద్వారా సామాన్యులకు చేరువగా సమాచార హక్కు చట్టం, సుజలాం, సుఫలాం అంటూ పరిశుభ్రత కోసం ఊరూవాడా చైతన్యం వంటి సామాజిక కార్యక్రమాలు చేపట్టారు.ఆయన మృతి మీడియా రంగానికి, తెలుగుజాతికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.

 

అక్షర యోధునికి అశృ నివాళి

  • రామోజీరావు మరణం తీవ్రంగా కలచివేసింది
  • ప్రజాస్వామ్యం కోసం తపించిన తీరు ఆదర్శప్రాయం

– యనమల రామకృష్ణుడు
నిజాలను ప్రజలకు చేరవేయాలి, ప్రభుత్వాలు ప్రజల కోసం పని చేసేలా ఉండాలని తపించే ఏకైక వ్యక్తి చెరుకూరి రామోజీరావు మరణం అత్యంత బాధాకరం. ఎక్కడో చిన్న రైతు కుటుంబంలో పుట్టి అచంచలమైన కష్టంతో ప్రపంచం మెచ్చే వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించిన తీరు అనితర సాధ్యం. ఎన్నో ఆటుపోట్లు.. మరెన్నో అవమానాలు అన్నింటినీ ఎదురొడ్డి, రామోజీరావు ఈ స్థాయికి చేరారు. వాస్తవాలు మాత్రమే ప్రజలకు తెలియాలని ఈనాడు అనే మీడియా వ్యవస్థను స్థాపించి.. ప్రజలకు తోడుగా నిలిచారు. మార్గదర్శి చిట్‌ఫండ్, ప్రియా ఫుడ్స్, కళాంజలి లాంటి ఎన్నో వ్యాపార సంస్థల్ని స్థాపించారు. ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్టూడియో రామోజీ ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేశారు. అతి తక్కువ సమయంలోనే జాతీయస్థాయి నెట్ వర్క్ గా ఈటీవీని విస్తరించారు. తెలుగు నాట ఎన్ని వార్తా పత్రికలొచ్చినా, ఎన్ని టీవీ ఛానళ్లు వచ్చినా.. నిజ నిర్ధారణ కోసం చూసే ఏకైక న్యూస్ నెట్‌వర్క్‌గా ఈనాడు, ఈటీవీని రూపుదిద్దారు. రామోజీ జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శం. ఆయన మృతి మీడియా రంగానికి, తెలుగుజాతికి తీరని లోటు.

 

అలుపెరుగని కృషీవలుడు రామోజీ రావు
– తెదేపా జాతీయ అధికార ప్రతినిధి గురజాల మాల్యాద్రి
అలుపెరగని కృషి, పట్టుదల, అంకితభావం, ధృడదీక్ష, పోరాటపటిమ, ప్రజాస్వామ్య పరిరక్షణలకు రామోజీరావు పర్యాయపదం. వేలాదిమందికి ఉపాధి కల్పించిన కల్పవృక్షం. తెలుగుభాష అభ్యున్నతికి ఎంతోగానో కృషిచేశారు. పాడుతా-తీయగా లాంటి కార్యక్రమాలతో ఎంతోమంది మట్టిలో మాణిక్యాలను వెలితీశారు. ప్రపంచంలోనే రెండవ స్థాయి కలిగిన ఫిల్మ్ సిటీని నిర్మించారు. మార్గదర్శి ద్వారా లక్షలాది మంది ఖాతాదారులకు నమ్మకమైన సేవలు అందించారు. అక్షరాస్యత ఉద్యమానికి ఈనాడు ఎంతగానో తోడ్పడింది. వ్యాపారంలో సమాజహితం చేసిన మహోన్నత వ్యక్తి. రామోజీ జీవితం భావితరాలు ఆదర్శంగా తీసుకోవాలి. రామోజీ రావు స్మృతికి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సముచిత స్థానం కల్పించాలి. రామోజీ రావు గారి ఆత్మకు శాంతి కలగాని ప్రార్ధన. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.

➡️