-విద్యార్థుల జీవితాలతో మోడీ చెలగాటం
– రాష్ట్ర ప్లీనరీలో ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత అధ్యక్షులు విపి సాను
ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి, ఆమదాలవలస :విద్యార్థుల జీవితాలతో ప్రధాని నరేంద్ర మోడీ చెలగాటమాడుతున్నారని ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత అధ్యక్షులు విపి.సాను అన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం చింతాడలోని జిఎల్ ఫంక్షన్ హాలులో శనివారం జరిగిన ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్లీనరీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గని ప్రారంభోపన్యాసం చేశారు. సమావేశం ప్రారంభ సూచికగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ప్రసన్నకుమార్ ఎస్‌ఎఫ్‌ఐ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సాను మాట్లాడుతూ నీట్ పరీక్షల్లో అవకతవకల వల్ల ప్రతిభావంతులైన విద్యార్థులు నష్టపోయారని, దీనికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. సమాజానికి, విద్యారంగానికి తీవ్ర నష్టం చేసే జాతీయ విద్యా విధానాన్ని తెరపైకి తెచ్చింది మోడీ ప్రభుత్వమేనని అన్నారు. దేశ ప్రజలకు బిజెపి మతోన్మాదం నుంచి ముప్పు పొంచి ఉందని, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకికవాదం ప్రమాదంలో పడనున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అయోధ్య రామమందిరం మీద ఉన్న శ్రద్ధ దేశంలోని నిరుద్యోగులు, విద్యార్థులు, యువజనులపై ఉంటే దేశ ప్రగతి కొంతమేరైనా సాధ్యపడేదన్నారు. బిజెపి ప్రభుత్వం అయోధ్య రామ మందిరం పేరుతో మభ్యపెట్టేందుకు ప్రయత్నించినా, అయోధ్యలోని పైజాబాద్ నియోజకవర్గ ప్రజలు సైతం తిరస్కరించారని తెలిపారు. విద్యారంగంలో సైతం కాషాయీకరణ చొప్పించి కలుషితం చేయాలని కేంద్ర ప్ర్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. 400 స్థానాల్లో గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చాలని చూసిన బిజెపికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని తెలిపారు. దేశం సర్వసత్తాక, సౌమ్యవాద, గణతంత్ర లౌకిక ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లాలని, అందుకనుగుణంగా విద్యార్థులు పోరాటాలు సాగించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో నాణ్యమైన విద్య, ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతుల కల్పన, హాస్టల్ విద్యార్థుల సమస్యలపై కార్యాచరణ అమలు చేసి ప్రణాళిక ప్రకారం పోరాడాలని కోరారు.
ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఎ.అశోక్ మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలోలేని నూతన విద్యా విధానాన్ని మన రాష్ట్రంలోనే అమలు చేయడం ద్వారా గత ప్రభుత్వం విద్యారంగాన్ని భ్రష్టు పట్టించిందన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో ఉత్తీర్ణతా శాతం దారుణంగా పడిపోయిందని తెలిపారు. డిగ్రీలో ఆన్‌లైన్ ప్రవేశాలు, ఆనర్స్ కోర్సుకు ప్రవేశాలు వంటి కొత్త విధానాలు తీసుకురావడం వల్ల విద్యార్థులు తీవ్ర వ్యయప్రయాసలకు లోనవుతున్నారని వివరించారు. సెల్ఫ్ ఫైనాన్స్ డే కోర్సులు తీసుకురావడంతో డిగ్రీ చదువుపై విద్యార్థుల ఆసక్తి తగ్గిందన్నారు. వైసిపి ప్రభుత్వం అవలంభించిన అస్తవ్యస్త విధానాలను సరిచేయడంతోపాటు విద్యారంగ సమస్యలను పరిష్కరిస్తామని మేనిఫెస్టోలో పెట్టిన టిడిపి, ఆ హామీలను నిలబెట్టుకోవాలని కోరారు.
