‘ఉక్కు’పై కేంద్రం కుట్రలు తిప్పికొట్టాలి

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : స్టీల్‌ప్లాంట్‌ నిర్వీర్యానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ఐక్య పోరాటాలతో తిప్పికొట్టాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైౖర్మన్లు డి ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్‌ అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు బుధవారానికి 1322వ రోజుకు చేరుకున్నాయి. దీక్షల్లో ఐఎన్‌టియుసి కార్యకర్తలు కూర్చున్నారు. వారినుద్దేశించి నాయకులు మాట్లాడుతూ అన్ని వైపుల నుంచి ఉక్కు ప్రయివేటీకరణకు కుట్రలు జరుగుతున్నా సుదీర్ఘ పోరాటంతో కార్మికులు అడ్డుకుంటున్నారని, ఇది చారిత్రాత్మకమని తెలిపారు. ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని కేంద్రానికి లేఖలు రాసినా, నిరసనలు, ఆందోళనలు చేపట్టినా పట్టకపోవడం దారుణమన్నారు. మున్ముందు ఉక్కు పరిరక్షణ పోరాటం మరింత ఉధృతం కానుందని తెలిపారు.

➡️