- పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పర్యటన
- ప్రాజెక్టు ప్రయోజనాలు, పనుల పురోగతిపైఅధికారుల వివరణ
ప్రజాశక్తి- ఏలూరు ప్రతినిధి, పోలవరం : పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను అధ్యయనం చేసేందుకు కేంద్ర జలశక్తి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ శనివారం ఈ ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించింది. ఉదయం 11 గంటలకు ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకున్న కమిటీ సాయంత్రం 4.30 గంటలకు పనులపై పరిశీలన చేసింది. కేంద్ర జలశక్తి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్‌పర్సన్ రాజీవ్ ప్రతాప్ రూడీ నేతృత్వంలో ప్రాజెక్ట్ ప్రాంతానికి చేరుకున్న బృందానికి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, పోలవరం ఎంఎల్‌ఎ చిర్రి బాలరాజు, జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి, ప్రాజెక్ట్ ఇంజనీర్లు పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు. బృందం… ప్రాజెక్ట్‌లోని స్పిల్‌వే ప్రాంతాన్ని, ఎగువ, దిగువ కాఫర్ డ్యాం, హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్, డయాఫ్రమ్ వాల్ పనులను పరిశీలించి జలవనరుల శాఖాధికారులు, ప్రాజెక్ట్ ఇంజనీర్లను వివరాలు అడిగి తెలుసుకుంది. ఆయా ప్రదేశాల్లో కాంట్రాక్టు ఏజెన్సీ, ప్రాజెక్ట్ ఇంజనీర్లు ప్రాజెక్ట్ పనుల ప్రగతిపై ఏర్పాటు చేసిన ఛాయా చిత్ర ప్రదర్శనలను కమిటీ సభ్యులు పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో ప్రాజెక్ట్ పనుల వివరాలను జలవనరుల శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ వివరిం చారు. పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్‌కు జీవ నాడిగా ఉందని, గతంలో తమ ప్రభుత్వ హయాంలో 72 శాతం పనులు పూర్తయ్యాయని మంత్రి రామానాయుడు కమిటీకి తెలిపారు. అంతకుముందు ప్రాజెక్ట్ సమావేశ హాల్లో కమిటీ సభ్యులతో కలిసి పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిపై కాంట్రాక్టు ఏజెన్సీ, ప్రాజెక్ట్ ఇంజనీర్లు, అధికారులతో కమిటీ చైర్మన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ ప్రయోజ నాలు, పనుల పురోగతిని జలవనరుల శాఖ అధికారు లు వివరించారు. ప్రాజెక్ట్ నిర్మాణ పనులపై కమిటీ చైర్మన్ లేవనెత్తిన పలు అంశాలను జలవనరుల శాఖాధికారులు నివృత్తి చేశారు. నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో చేపట్టిన గృహనిర్మాణలపై అధికారులను కమిటీ చైర్మన్ అడిగి తెలుసుకున్నారు. ఈ కమిటీలో రాజ్యసభ, లోక్‌సభ సభ్యులు ఖిరు మహ్తౌ, ధర్మశీల గుప్తా, రీ షేర్ సింగ్ ఘుబాయా, రోడ్మల్ నగర్, జోయంత బసుమతరీ, నారాయణ్ దాస్ అహిర్వార్, సంజ్ఞ జాతవ్, సాగర్ ఈశ్వర్ ఖండ్రే, విశాల్ (దాదా) ప్రకాష్బాపు పాటిల్, మోహితే-పాటిల్ ధైర్యషీల్ రాజ్‌సిన్హ్ సభ్యులుగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ ఆర్ కమిషనర్ ఎస్.రామ్ సుందర్‌రెడ్డి, చీఫ్ ఇంజనీర్లు నరసింహమూర్తి, బి.రాంబాబు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మెంబర్ సెక్రటరీ ఎం.రఘురాం, ఎపి జెన్‌కో ఎండి కెవిఎన్. చంద్రశేఖర్, కేంద్ర జలసంఘం మెంబర్ గోపాల్ సింగ్, మెగా ఇంజనీరింగ్ కంపెనీ ఎండి సిహెచ్‌వి. సుబ్బయ్య, జిల్లా జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి, ఇరిగేషన్ సలహాదారు ఎం.వెంకటేశ్వర రావు, ఆర్‌డిఒ ఎంవి.రమణ తదితరులు పాల్గొన్నారు.