4న రాత్రి 9 గంటలకు ఎన్నికల తుది ఫలితాలు- సిఇఒ ముఖేష్‌కుమార్‌ మీనా

ప్రజాశక్తి- అమరావతి బ్యూరో :జూన్‌ 4న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ప్రధాన ఏర్పాట్లు పూర్తిచేశామని, అదేరోజు రాత్రి 9 గంటలకు తుది ఫలితాలను ప్రకటిస్తామని సిఇఒ ముఖేష్‌కుమార్‌ మీనా తెలిపారు. న్యూఢిల్లీ నిర్వచన్‌ భవన్‌ నుండి సీనియర్‌ డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనరు నితీష్‌ వ్యాస్‌ బుధవారం నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో ముఖేష్‌ ఈ విషయం చెప్పారు. రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు, నియోజకవర్గాల్లో చేస్తున్న ఏర్పాట్లపై నితీష్‌ వ్యాస్‌ ఆరా తీశారు. ఫలితాల ప్రకటనకు అనుసరిస్తున్న ప్రణాళిక బద్ధమైన చర్యలను, బందోబస్తు ఏర్పాట్లను ఇక్కడి ఎన్నికల అధికారులు నివేదించారు. రాష్ట్రంలో మొత్తం 175 శాసనసభ నియోజకవర్గాల్లో 111 నియోజకవర్గాల్లో 20 రౌండ్లలోపు, 61 నియోజకవర్గాల్లో 21 నుంచి 24 రౌండ్లలోపు, మిగిలిన మూడు నియోజకవర్గాల్లో 25 రౌండ్లకు పైగా ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరిగేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నామన్నారు. 111 నియోజకవర్గాల్లో మధ్యాహ్నం 2 గంటల్లోపు, 61 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల్లోపు, మిగిలిన మూడు నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల్లోపు ఓట్ల లెక్కింపు పూర్తవుతుందని, మొత్తంగా రాత్రి 9 గంటలకు తుది ఫలితాలు వెల్లడిస్తామన్నారు. కాగా ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ఎస్‌పిలు, సిపిలను అప్రమత్తం చేశామని అడిషనల్‌ డిజి, స్టేట్‌ పోలీస్‌ నోడల్‌ ఆఫీసరు ఎస్‌ బాగ్చీ తెలిపారు. ఈ వీడియోకాన్ఫరెన్స్‌లో అడిషనల్‌ సిఇఒ హరీందర్‌ ప్రసాద్‌, జిల్లా ఎన్నికల అధికారులు, పోలీస్‌ కమిషనర్లు, ఎస్‌పిలు పాల్గొన్నారు.

➡️