పార్టీలు మారడం కాదు.. విధానాలు మారాలి : సిహెచ్‌ బాబూరావు

విజయవాడ : భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) విజయవాడ పశ్చిమ సిటీ 23వ మహాసభలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నెహ్రు బొమ్మ సెంటర్‌ నుండి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్‌ బాబూరావు, ఎన్టీఆర్‌ జిల్లా కార్యదర్శి సిపిఎం కార్యకర్తలు, ప్రజలు, వివిధ వర్గాల కార్మికులు పాల్గొన్నారు. మోటూరు హనుమంతరావు శ్రామిక భవన్‌ వద్ద నిర్వహించిన బహిరంగ సభకు సిటీ కార్యదర్శి బోయి సత్యబాబు అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ… పెరిగిన విద్యుత్‌ భారాలను తగ్గించాలని, అర్హులకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు, కొండ ప్రాంత ఇళ్లకు పట్టాలు, రిజిస్ట్రేషన్లు చేయాలని, డిగ్రీ కాలేజీ సాధనకు, షేక్‌ రాజా హాస్పిటల్‌ ను 100 పడకల హాస్పిటల్‌ గా మార్చాలని వీటిపై ఇప్పటికే సిపిఎం పోరాటం చేస్తుందని తెలిపారు. మరింత బలంగా ఈ పోరాటాలు జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. మోడీ ప్రభుత్వం, బిజెపి, టిడిపి, జనసేనలు ఆంధ్రప్రదేశ్‌ ను అదానికి అప్పగించే ప్రయత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ ప్రయత్నాలను అడ్డుకునేందుకు ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందని, అందుకే రానున్నది ఉద్యమ కాలమని అన్నారు. ఈ నేపథ్యంలో సిపిఎం, వామపక్షాలను బలపర్చాల్సిన అవసరం ఉందని అన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్‌ బాబూరావు మాట్లాడుతూ … అదాని ముడుపుల కేసుపై మోడీ, చంద్రబాబు, పవన్‌ మాట్లాడటం లేదని అన్నారు. అవినీతిని అంతం చేస్తామని ప్రచారం చేస్తున్న వీరు అదాని, జగన్‌ లను ఈ కేసులో ఎందుకు విచారణ జరపడం లేదని మండిపడ్డారు. పార్టీలు, నాయకులు, జెండాలు మారడం కాదని విధానాలు మారాలని తెలిపారు. ప్రత్యామ్నాయ విధానాలు సిపిఎం, వామపక్షాలు ప్రజలకు మేలు చేస్తాయని తెలిపారు. మతోన్మాద ఎజెండాతో విధానాలు దేశానికి నష్టం చేస్తున్నాయని, మణిపూర్‌ అల్లర్లపై ఇప్పటికీ కేంద్ర బిజెపి, నేటి కూటమి ప్రభుత్వం కానీ, నాటి వైసిపి ప్రభుత్వం కానీ నోరు మెదపలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వైసిపి వదిలిన చెప్పుల్లో కూటమి ప్రభుత్వం కాలు పెట్టి నడుస్తుందని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఉపయోగపడే దుర్గా కో ఆపరేటివ్‌ బ్యాంకును మూసేస్తే ఇప్పటి వరకు ప్రజా ప్రతినిధులు మాట్లాడలేదని మండిపడ్డారు. పెన్షన్లు పింఛన్లను రద్దు చేస్తే సిపిఎం పోరాటం చేస్తుందని హెచ్చరించారు. మంచి మందు కాదు… మంచి నాణ్యమైన రేషన్‌ సరుకులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. చిత్తశుద్ధి ఉంటే నాసికం బియ్యం స్థానంలో నాణ్యమైన బియ్యం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

➡️