- కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్
- మండలిలో ప్రస్తావిస్తాం : పిఎడిఎఫ్ ఎంఎల్‌సి ఐవి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు పోరుబాట పట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు ఆంక్షలు అమలు చేసినప్పటికీ వేలాదిగా ఆశాలు గురువారం విజయవాడకు తరలివచ్చారు. దీంతో ధర్నాచౌక్ ప్రాంతం కిక్కిరిసిపోయింది. ఎండ తీవ్రంగా ఉన్నప్పటికీ భారీగా కదిలివచ్చిన ఆశా వర్కర్లతో గాంధీ నగర్ సాంబమూర్తి రోడ్డు పూర్తిగా బ్లాక్ అయ్యింది. పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా ధర్నా చౌక్‌కు వస్తున్న ఆశా వర్కర్లే కనిపించారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశించి వాహనాల రాకపోకలను ఇతర రోడ్లకు మళ్లించారు, తమ న్యాయమైన డిమాండ్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు చేసిన నినాదాలతో ఆ ప్రాంతం మారుమ్రోగింది. కనీస వేతనాలు అమలు చేయాలని, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను ఆశావర్కర్లుగా గుర్తించాలని, గతంలో జరిగిన ఒప్పందాలపై ఉత్తర్వులు విడుదల చేయాలని, ప్రభుత్వ సెలవులు, ప్రసూతి సెలవులు అమలు చేయాలని, దహన సంస్కారాల ఖర్చులకు రూ.20వ వేలు చెల్లించ్లాంటూ ఆశాలు నినాదాలు చేశారు. ధర్నాకు ఎపి ఆశావర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు కె.పోశమ్మ అధ్యక్షత వహించారు. ధర్నాకు మద్దతు తెలిపిన పిడిఎఫ్ ఎంఎల్‌సి ఐ. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అశా వర్కర్ల సమస్యలను శాసన మండలిలో ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని హామీ ఇచ్చారు. ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారానికి పిడిఎఫ్ పూర్తి మద్దతు ఇస్తోందని తెలిపారు. కేంద్ర ప్రాయోజిత పథకాల వర్కర్లకు మినిమం టైమ్ స్కేల్ వర్తించదని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జిఒ 2ను విడుదల చేయడం దుర్మార్గమన్నారు. ఈ ఉత్తర్వులు రద్దు చేసి కేంద్ర ప్రాయోజిత పథకాల్లో పని చేస్తున్న వారికి కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు గ్రాట్యూటీ పథకాన్ని ఈ నెల 8వ తేదీన సిఎం చంద్రబాబు ప్రకటించనున్నట్లు మంత్రి చెప్పారని, అదే విధంగా ఆశాలకు కూడా గ్రాట్యూటీ అమలు చేయాలని అన్నారు. ఆశావర్కర్లకు జీతంతో కూడిన ప్రసూతి సెలవు ఇవ్వాలని పిడిఎఫ్ పక్షాన డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లకు పదోన్నతులు కల్పించాలని, కార్మిక చట్టం ప్రకారం సెలవులు ఇవ్వాలన్నారు. ఆశాలపై రాజకీయ జోక్యాన్ని నివారించాలని కోరారు.
కనీస వేతనాలు ఇవ్వరా : సిహెచ్ నరసింగరావు
సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.హెచ్. నరసింగరావు మాట్లాడుతూ… వేల కోట్లు అదానీకి దోచిపెట్టే పభ్రుత్వాలు కార్మికులకు కనీస వేతనం నెలకు రూ.26 వేలు ఇచ్చేందుకు మాత్రం చేతులు రావడం లేదన్నారు. ధర్నాకు రాకుండా పలు చోట్ల ఆశావర్కర్లను ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి అడ్డుకుందని తెలిపారు. నిర్భందంతో ఉద్యమాలను ఆపాలనుకోవడం సరైన విధానం కాదన్నారు. మహిళా సాధికారత అని చెప్పే సిఎం మహిళలకు కనీస వేతనాలు ఇవ్వకుండా సాధికారత ఎలా సాధిస్తారని ప్రశ్నించారు.
నిర్లక్ష్యం వద్దు : కె. ధనలక్ష్మి
ఆశాల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం విషయంలో నిర్లక్ష్యం చూపవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్ధేశించి ఎపి ఆశావర్కర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మీ అన్నారు. సమస్యలపై ప్రభుత్వంతో చర్చలు జరిగి ఏడాది అవుతున్నా, ఇందుకు సంబంధించి ఉత్తర్వులు విడుదల కాలేదన్నారు. గత ఏడాదిలో మృతి చెందిన ఆశా వర్కర్లకు పిఎంజెజెబివై వర్తింపజేస్తామని చెప్పినా, ప్రీమియం చెల్లించకపోవడంతో ఆ బీమా సౌకర్యానికి నోచుకోలేదన్నారు. ఆశావర్కర్లను కార్మికులుగా గుర్తించాలని ఏళ్లతరబడి మొర పెట్టుకుంటున్నా పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల వలే ఆశా వర్కర్లను 60 ఏళ్లకు పదవీ విరమణ చేయిస్తున్నారే తప్ప రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వానికి రెండు నెలలు గడువు ఇస్తున్నామని ఈ లోగా ఆశాల సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు సిద్ధమవుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర నాయకులు కె.ఉమామహేశ్వరరావు, ఎ.వెంకటేశ్వరరావు, ఎపి ఆశావర్కర్ల సంఘం కోశాధికారి ఎ.కమల, రాష్ట్ర నాయకులు పద్మ, రాఘవమ్మ, ధనశ్రీ, లక్ష్మీ,సౌభాగ, సుభాషిణి, అమర, సుధారాణి, పార్వతి, రమణకుమారి, గంగా, జ్యోతి వెంకటలక్ష్మీ, వెంకటేశ్వరమ్మ, వాణిశ్రీ తదితరులు ప్రసంగించారు.