ప్రజాశక్తి – ఏలూరు సిటీ : ఉద్యోగులకు రావాల్సిన ఆర్థిక బకాయిల సాధనకై ఈ నెల 27వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం చేపట్టనున్నట్లు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల జెఎసి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఛైర్మన్ చోడగిరి శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం స్థానిక జిల్లా పరిషత్ ప్రాంగణంలోని పంచాయతీ రాజ్ మినిస్టీరియల్ స్టాఫ్ సంఘం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడారు. నాలుగున్నర సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల, ఉపాధ్యాయుల, పెన్షనర్ల పట్ల అవలంబిస్తున్న తీరుకు తాము అనేకసార్లు మంత్రివర్గ ఉప సంఘాన్ని, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాల్లోనూ చర్చించి చీఫ్ సెక్రటరీని కలిసి వినతిపత్రాలు అందజేశామని తెలిపారు. అనేక రూపాల్లో ఆందోళనలు చేశామని తెలిపారు.ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు, జిపిఎఫ్ లోన్లు సకాలంలో రాకపోవడం, ఎపి జిఎల్‌ఐ లోన్ల సర్వర్లు పనిచేయకపోవడం, అదేవిధంగా మెడికల్ రీయంబర్స్‌మెంట్ రాకపోవడం, కోవిడ్‌లో మరణించిన వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు ఇవ్వాలని తదితర సమస్యలను విన్నవించినా స్పందన లేదన్నారు. సోమవారం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్, మంత్రివర్గంతో జరిగిన చర్చల్లో మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ, చీఫ్ సెక్రటరీలను 12వ పిఆర్‌సికి సంబంధించి ఐఆర్ ఇవ్వాలని కోరినా ప్రభుత్వం దిగి రాలేదన్నారు. సిపిఎస్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల 90 శాతం బకాయిలు నేటికీ ప్రభుత్వం విడుదల చేయకపోగా ఐఆర్‌ను ప్రస్తుతం ప్రకటించలేమని, నేరుగా పిఆర్‌సి ఇస్తామని బొత్స సత్యనారాయణ చెప్పారని తెలిపారు. దానికి ఉద్యోగ సంఘం నేతలు ఒప్పుకోలేదని, ఈ నేపథ్యంలో జెఎసి ముందుగా ప్రకటించిన దశలవారీ ఆందోళనలో భాగంగా బుధవారం నుంచి ప్రతి ఆఫీసులో బ్లాక్ బాడ్జెస్ పెట్టి కలెక్టర్, తహశీల్దార్, ఆర్‌డిఒ వినతి పత్రాలు అందజేస్తామని తెలిపారు. 15, 16 తేదీల్లో లంచ్ అవర్ డెమోనిస్ట్రేషన్ చేస్తామని, అలాగే 17వ తేదీన ర్యాలీలు, ధర్నాలతో తాలూకా హెడ్ క్వార్టర్స్ వద్ద ఉదయం పది నుంచి ఐదు గంటల వరకూ చేస్తామని, 20న జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేస్తామని, 27న చలో విజయవాడ నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగ, కార్మిక పెన్షనర్లు పాల్గొనాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జెఎసి కన్వీనర్ రామారావు, యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆర్.రవికుమార్, ముస్తఫా ఆలీ పాల్గొన్నారు.
