ఐదు చోట్ల మార్పు

Apr 22,2024 07:57 #B-forms, #candidates, #Nara Chandrababu
  •  టిడిపి అభ్యర్థులకు బి ఫారాలు అందించిన చంద్రబాబు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టిడిపి ముందుగా ప్రకటించిన జాబితాలో ఐదు చోట్ల అభ్యర్థులను మార్చింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి, ఉమ్మడి విశాఖపట్నంలోని మాడుగుల, పాడేరు, అనంతపురం జిల్లాలోని మడకశిర, నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్పుచేసింది. టిడిపి నుంచి లోక్‌సభ, శాసనసభకు పోటీచేస్తున్న అభ్యర్థులకు బి ఫారాలను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదివారం ఉండవల్లిలోని తన నివాసంలో అందజేశారు. ఉండికి ముందుగా ప్రకటించిన సిట్టింగ్‌ ఎమ్మెల్యే మంతెన రామరాజుకు బదులు నరసాపురం వైసిపి సిట్టింగు ఎంపి రఘురామ కృష్ణరాజుకు, మాడుగులకు పైలా ప్రసాద్‌కు బదులు మాజీ మంత్రి బండారు సత్యనారాయణకు, పాడేరు.. వెంకట రమేష్‌నాయుడుకు బదులు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి, వెంకటగిరి.. కురుగొండ్ల లక్ష్మీప్రియకు బదులు ఆమె తండ్రి రామకృష్ణకు బి ఫారాలు అందజేశారు.
ఉండి, అనపర్తి సీట్ల విషయంలో బిజెపి తన మాట నెగ్గించుకొంది. అనపర్తి బిజెపి అభ్యర్థి శివకృష్ణరాజు వైసిపి అభ్యర్థి సత్తి సూర్యనారాయణ రెడ్డికి పోటీ ఇవ్వలేరని, ఈ సీటు ఓడిపోతుందనే ఆందోళన కూటమిలో మొదటి నుంచి నెలకొంది. అక్కడ టిడిపి ఇన్‌ఛార్జిగా ఉన్న నల్లిమిల్లి రామకృష్ణారెడ్డిని పార్టీలో చేర్చుకుని పోటీలో నిలిపేందుకు బిజెపి ప్రయత్నాలు చేసింది. నల్లిమిల్లి బిజెపిలో చేరేందుకు ముందుగా సుముఖత వ్యక్తం చేయలేదు. పొత్తులో భాగంగా బిజెపికి కేటాయించిన అనపర్తి నియోజకవర్గాన్ని టిడిపికి ఇచ్చి దెందులూరును ఇవ్వాలన్న టిడిపి ప్రతిపాదనలను అంగీకరించలేదు. దీంతో గత్యంతరం లేక ఇప్పుడు నల్లిమిల్లిని బుజ్జగించి బిజెపిలోకి పంపేందుకు టిడిపి అధినాయకత్వం చర్చలు జరుపుతోంది. మరోవైపు వైసిపి నుంచి గెలిచి ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విమర్శలు చేస్తున్న రఘురామ కృష్ణరాజుకు నరసాపురం లోక్‌సభ స్థానాన్ని కేటాయించాలని బిజెపిని టిడిపి కోరింది. రఘురామ కృష్ణరాజుకు నరసాపురం టికెట్‌ రాకుండా వైఎస్‌ జగన్‌ బిజెపిని ప్రభావితం చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో గత్యంతరం లేక టిడిపినే ముందుగా ప్రకటించిన అభ్యర్థిని మార్చి ఉండి శాసనసభ నుంచి రఘురామను బరిలోకి దింపుతోంది. మడకశిరకు ముందుగా ప్రకటించిన ఎంఇ సునీల్‌కుమార్‌ అభ్యర్థిత్వాన్ని మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి వ్యతిరేకించడంతో టిడిపి ఎస్‌సి సెల్‌ ఇన్‌ఛార్జి ఎంఎస్‌ రాజుకు టికెట్‌ కేటాయించారు. మాడుగుల, పాడేరు, వెంకటగిరి అభ్యర్థులను మార్పు చేస్తేనే అవకాశాలు ఉన్నాయని సర్వేలు రావడంతో ఈ మూడు నియోజకవర్గాల్లో టిడిపి మార్పులు చేసింది. దెందులూరు, తంబలపల్లె అభ్యర్థులకు బి ఫారాలు ఇవ్వలేదు. అనపర్తి మార్పు జరగకపోవడంతో చింతమనేని ప్రభాకర్‌ను దెందులూరు నుంచి నామినేషన్‌ వేసుకోవాలని అధినాయకత్వం చెప్పినట్లు తెలిసింది. తంబళ్లపల్లి అభ్యర్థి జయచంద్రారెడ్డికి బదులు శంకర్‌యాదవ్‌కు టికెట్‌ కేటాయించే అవకాశం ఉంది.
అభ్యర్థుల చేత ప్రతిజ్ఞ
బి ఫారాలు అందుకున్న అభ్యర్థుల చేత చంద్రబాబు ప్రతిజ్ఞ చేయించారు. రానున్న 20 రోజులు కీలకమని చంద్రబాబు అభ్యర్థులతో ఈ సందర్భంగా చెప్పారు. ప్రతి అభ్యర్థీ గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని కోరారు. ప్రజలు, కార్యకర్తల అభీష్టం మేరకే అభ్యర్థులను ఎంపిక చేశామన్నారు. కార్యకర్తతో ప్రతి అభ్యర్థీ అనుసంధానం కావాలని తెలిపారు. మూడు పార్టీల నేతల మధ్య సమన్వయం ఉండాలని, ఓటు బదిలీ జరగాలని సూచించారు. కొత్తగా చేరిన వారు పార్టీ లైన్‌ ప్రకారం నడుచుకోవాలని ఆదేశించారు. వైఎస్‌ జగన్‌ ప్రతిసారీ సానుభూతితో గెలవాలని ప్రయత్నిస్తున్నారని, రాష్ట్రానికి ఏం చేశారో చెప్పుకోలేక డ్రామాలకు తెరతీస్తున్నారని విమర్శించారు. పింఛన్ల విషయంలో జగన్‌ చేసిన కుట్రలు, ఆడిన రాయి డ్రామాను ప్రజలు ఛీ కొట్టారని చెప్పారు.

➡️