-98 శాతం హామీలు మరిచారు
– నేతన్నలతో సిఎం ముఖాముఖి
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి :చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలను చంద్రబాబు నాయుడు 98 శాతం అమలు చేయలేదని కేవలం రెండు శాతం మాత్రమే అమలు చేశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. గుంటూరు జిల్లా మంగళగిరి సికె కన్వెన్షన్ హాలుతో శనివారం చేనేత కార్మికులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిఎం మాట్లాడుతూ.. చేనేత కార్మికులకు ఇల్లు, మగ్గం అని చంద్రబాబు మోసం చేశారన్నారు. ఎన్‌డిఎ కూటమి ఆధ్వర్యంలో రూపొందించిన మ్యానిఫెస్టోలో చేనేత కార్మికులకు ఎటువంటి మేలు చేయలేదని చెప్పారు. బిసిల సీట్లను చంద్రబాబు, లోకేష్ లాక్కుని రూ.కోట్లు కుమ్మరిస్తూ మంగళగిరిలో గెలవాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలం ఇద్దామని ప్రయత్నిస్తే కోర్టుకు వెళ్లి చంద్రబాబు నాయుడు అడ్డుకున్నారన్నారు. సిఎం జగన్‌కు చేనేత వస్త్రాలు, రాట్నం మెమోంటోను ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, లావణ్య బహూకరించారు. అంతకు ముందు నంబూరు అడ్డరోడ్డు నుంచి మంగళగిరి వరకు రోడ్‌షో నిర్వహించారు. చేనేత కార్మికులతో సమావేశం అనంతరం తిరిగి సాయంత్రం బస్సుయాత్ర నిర్వహించారు.
జగన్‌కు భారతి అభివాదం
బస్సు యాత్రలో భాగంగా విజయవాడ వెళ్తున్న సిఎం జగన్‌కు తాడేపల్లిలో ఆయన సతీమణి వైఎస్ భారతీ అభివాదం చేశారు. తమ ఇంటికి సమీపంలో యాత్ర వెళ్తుండగా ప్రధాన రహదారిపైకి వచ్చి ఆమె అభివాదం చేశారు. ప్రతిగా భారతికి చెయ్యి ఊపి జగన్ అభివాదం చేశారు.
ఎన్‌టిఆర్ జిల్లాలోకి ప్రవేశించిన యాత్ర
కనకదుర్గ బ్యారేజీ మీదుగా విజయవాడలోకి యాత్ర ప్రవేశించింది. శిఖామణి సెంటర్, చుట్టుగుంట, పైపులరోడ్డు మీదుగా కేసరపల్లి వరకూ యాత్ర కొనసాగింది.
