- ఉపాధి కల్పనకు 24 సంస్థలతో ఒప్పందాలు
- ఎన్ని కాన్పులకైనా ప్రసూతి సెలవులు
- అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభలో చంద్రబాబు
ప్రజాశక్తి- మార్కాపురం, ఒంగోలు బ్యూరో : ఈ ఏడాది లక్షమంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలన్నదే తన ఆలోచనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఇకపై ఎంతమంది పిల్లలను కన్నా, అన్ని కాన్పులకూ ప్రసూతి సెలవులు ఇస్తామని ప్రకటించారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో శనివారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభలో ఆయన డ్వాక్రా సంఘాల మహిళలతో మాటామంతీ నిర్వహించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ మహిళలు అన్ని అవకాశాలనూ అందిపుచ్చుకొని ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. అవకాశాలను తెచ్చే పని తాను చేస్తానని, వాటిని వినియోగించుకుని ఉపాధి పొందాలని సూచించారు. ఫ్లిప్‌కార్డు, అరకు కాఫీ తదితర 24 సంస్థలతో ఈ సందర్భంగా చేసుకున్న ఒప్పందాలను వివరించారు. డ్వాక్రా ఉత్పత్తులను ప్రపంచ స్థాయి మార్కెట్లోకి తీసుకొనిపోయి అమ్ముకునేలా చేస్తామన్నారు. వస్తువుల తయారీలో నాణ్యత పెంచేందుకు శిక్షణ తీసుకోవాలని సూచించారు. మహిళలు తయారు చేసిన వస్తువులను కొనుగోలు చేయించే బాధ్యత తనదేన్నారు. ఆనాడు ఆర్‌టిసిలో కండక్టర్లుగా మహిళలను తీసుకున్నామని గుర్తు చేశారు. ఇప్పుడు రాపిడో వంటి సంస్థలతో మహిళలు కూడా ఉపాధి పొందే అవకాశం ఉందన్నారు. డ్వాక్రా మహిళలకు నాలుగు గిన్నీస్ రికార్డులు వచ్చాయంటే ఎంత వ్యాపారం చేశారో చెప్పాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. రూ.35 వేల కోట్ల రుణాలు తీసుకుని తిరిగి చెల్లిస్తున్నారంటే ఎంతో గర్వంగా ఉందన్నారు. ఆడబిడ్డల చదువు ఆగిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆనాడు పాఠశాలల విద్యార్థినులకు సైకిళ్లను అందజేశామని ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. చదువుకోవడం వల్లనే ఈ రోజు మహిళలు శక్తిగా ఎదిగారన్నారు. డ్వాక్రా సంఘాల వల్ల మహిళలకు గౌరవం పెరిగిందని పేర్కొన్నారు. టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని సూచించారు. వెలుగొండ ప్రాజెక్టుపై ఓ మహిళ అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ ఈ ప్రాజెక్టును గతంలోనే ప్రారంభించారు కదా? నీళ్లు రాలేదా? అని చమత్కారంగా అడిగారు. ఆయన చెప్పిందంతా ఒట్టిమాటలే కదా? అని చంద్రబాబు అన్నారు. వెలుగొండను పూర్తి చేసే బాధ్యత తనదేనని తెలిపారు. కృష్ణా నది నుంచి చాలనప్పుడు గోదావరి నీటిని కృష్ణాకు మళ్లించి అక్కడ నుంచి కృష్ణా కాలువల ద్వారా వెలుగొండ కాలువలకు అనుసంధానం చేసి ఆయకట్టు రైతులకు నీళ్లు అందిస్తామని వివరించారు. మార్కాపురం జిల్లాను త్వరలో ఏర్పాటు చేసి ఎన్నికల హామీని నిలబెట్టుకుంటానన్నారు.
మహిళల రక్షణకు ‘శక్తి’ యాప్ ఆవిష్కరణ
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల రక్షణ కోసం ‘శక్తి’ పేరుతో రూపొందించిన యాప్‌ను చంద్రబాబు ఆవిష్కరించారు. యాప్‌ను మహిళలు తమ సెల్‌ఫోన్లో డౌన్‌లోడ్ చేసుకోవాలని కోరారు. ఎక్కడైనా అకతాయిలతో ప్రమాదం పొంచి ఉంటే ఐదు లేదా ఆరుసార్లు సెల్‌ఫోన్‌ను ఊపితే 7-8 నిమిషాల వ్యవధిలో పోలీసులు అక్కడకు చేరుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, గుమ్మడి సంధ్యారాణి, డిజిపి హరీష్‌కుమార్ గుప్తా, ఎమ్మెల్యేలు కందుల నారాయణరెడ్డి, దామచర్ల జనార్థన్, ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, ముత్తుముల అశోక్‌రెడ్డి, బిఎన్ విజయకుమార్, మారిటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య, పర్యాటక సంస్థ చైర్మన్ నూకసాని బాలాజీ, 20 సూత్రాల కమిటీ చైర్మన్ లంకా దినకర్, దర్శి ఇన్‌ఛార్జి గొట్టిపాటి లక్ష్మి, కలెక్టర్ తమీన్ అన్సారియా, ఎస్‌పి దామోదర్ తదితరులు పాల్గొన్నారు.