పింఛను పంపిణీ అడ్డుకోవాలనుకుంటున్న చంద్రబాబు -మంత్రి విడదల రజని

ప్రజాశక్తి-గుంటూరుజిల్లా ప్రతినిధి :వృద్ధులు, వికలాంగులకు పింఛన్ల పంపిణీని అడ్డుకోవాలని చంద్రబాబు నాయుడు, ఆయన అనుచరులు ప్రయత్నిస్తున్నారని మంత్రి విడదల రజని ఆరోపించారు. గుంటూరులో తన కార్యాలయంలో ఆదివారం ఆమె విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. వలంటీర్ల ద్వారా పింఛను పంపిణీ నిలిపివేయాలని చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్‌, నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ కలిసి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడం వెనుక రాజకీయ దురుద్దేశంతో పాటు పేదల పట్ల వారుకున్న వ్యతిరేకతను మరో సారి రుజువు చేసుకున్నారని అన్నారు. ఇంటికి వెళ్లి పింఛన్లు ఇవ్వడం వలంటీర్లకే సాధ్యమయ్యిందని చెప్పారు. చంద్రబాబు హయాంలో వృద్దులు, వికలాంగులు పింఛన్లు తీసుకోవడానికి అష్టకష్టాలుపడేవారని గుర్తు చేశారు. ఎప్పుడు, ఎక్కడ ఇస్తారో తెలియక రోజుల తరబడి లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరిగే వారని తెలిపారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత ఇంటింటికి వెళ్లి పింఛన్లు ఇవ్వడం ద్వారా వృద్ధులు, వికలాంగులకు సులభతరమైన విధానం అమలు చేయడం దేశ వ్యాప్తంగా ఆదర్శనీయంగా మారిందన్నారు. చంద్రబాబు హయంలో జన్మభూమి కమిటీల దయాదాక్షిణ్యాలపైనే పింఛన్లు వచ్చేవని, గత ఐదేళ్లుగా ఈ విధానం మార్చి అర్హులందరికి ఇస్తున్నామని చెప్పారు.

➡️