పేదరికం లేని రాష్ట్రాన్ని తయారు చేస్తా : సిఎం చంద్రబాబు

ప్రజాశక్తి-అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ లో పీ4 కార్యక్రమం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ‘ పీ-4’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వెలగపూడిలోని సచివాలయానికి సమీపంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. మంగళగిరికి చెందిన నరసింహ కుటుంబాన్ని తొలి బంగారు కుటుంబంగా, భవన నిర్మాణ కార్మికుడు ఇమ్మాన్యుయెల్‌ కుటుంబాన్ని రెండో బంగారు కుటుంబంగా ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పయ్యావుల కేశవ్‌, నాదెండ్ల మనోహర్‌, కొల్లు రవీంద్ర, గొట్టిపాటి, డీబీవీ స్వామి, కూటమి ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సిఎం చంద్రబాబు మాట్లాడుతూ.. పేదరికం లేని రాష్ట్రాన్ని తయారు చేస్తానని ఎపి సిఎఇం చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో పేదరికం లేకుండా చేసేందుకే పీ4 కార్యక్రమం తీసుకొచ్చినట్లు తెలిపారు. పీ4 వంటి వినూత్నమైన కార్యక్రమంతో పేదల జీవితాల్లో తప్పకుండా మార్పు వస్తుందని పేర్కొన్నారు. త్వరలోనే ఏపీ రాజధాని అమరావతి రూపురేఖలు మారిపోతాయన్నారు. దేశంలోనే గొప్పగా అమరావతి అభివద్ధి చెందబోతోందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.

డిప్యూటి సిఎం పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ.. ఈ ఉగాది చరిత్రలోనే మిగిలిపోతుందన్నారు. ఈ రోజు చంద్రబాబు ముఖ్యమంత్రిగా లేకపోతే పి4 కార్యక్రమం ఉండేది కాదన్నారు. తెలుగు ప్రజలు బాగుండాలనేదే సీఎం చంద్రబాబు, నా ఆకాంక్ష అని అన్నారు. వైసిపి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులను అనేక ఇబ్బందులు పెట్టిందన్నారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారనే చంద్రబాబుకు మద్దతిచ్చినట్లు చెప్పారు. సమర్థ నాయకుడు కాబట్టే చంద్రబాబుకు మద్దతిచ్చాను. ఆయన సీఎం అయ్యాక కార్మికుల జీవితాల్లో మార్పు వచ్చిందన్నారు. పీ-4 వల్ల 30 లక్షల కుటుంబాల జీవితాల్లో మార్పులు వస్తాయి. ఎదుగుతున్న క్రమంలో కష్టపడి నేర్చుకున్నవారే అద్భుతాలు చేస్తారని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

➡️