హింసపై గవర్నరుకు చంద్రబాబు లేఖ.. డిజిపికి ఫిర్యాదు

May 14,2024 18:56 #chandrababau, #dadi, #YCP
  •  ప్రత్యేక కమిటీ ఏర్పాటు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎన్నికల అనంతరం రాష్ట్రంలో టిడిపి కార్యకర్తలు, నాయకుల ఇళ్లపై వైసిపి దాడులకు పాల్పడిందని టిడిపి అధినేత చంద్రబాబు… గవర్నర్‌, డిజిపికి లేఖ రాశారు. ముఖ్యంగా తిరుపతిలో పులివర్తినాని, పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో టిడిపి కార్యకర్తల ఇళ్లపై దాడి అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో మాచర్ల నియోజకవర్గంలో ఎక్కువ దాడులు జరిగాయని తెలిపారు. దీనిపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే తిరుపతిలో పులివర్తినానిపై జరిగిన దాడిపై ఎన్నికల సంఘానికీ ఫిర్యాదు చేశారు. దాడులు అంశాన్ని ముందుగానే పోలీసులు తెలిపినా స్పందించలేదని లేఖలో పేర్కొన్నారు. పలు ప్రాంతాల్లో వైసిపి నాయకులు పోలీసులను తీవ్రంగా కొట్టారని, అడ్డూ అదుపు లేకుండా కర్రలు, కత్తులు, రాళ్లతో దాడులకు తెగబడ్డారని వివరించారు. 2000 మంది వైసిపి కార్యకర్తలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు నేతృత్వంలో తెలుగుదేశం నాయకులే లక్ష్యంగా దాడులకు దిగారని, వారిని హత్య చేయాలనే కుట్ర ఉందని తెలిపారు. తాడిపత్రిలోనూ రెండోరోజు పెద్దారెడ్డి అనుచరులు దాడులు చేశారని వివరించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుడి ఇంటిపై పెద్దారెడ్డి నేతృత్వంలో దాడి చేశారని అన్నారు. హింసకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్‌లో గొడవలు జరగకుండా చర్యలు చేపట్టాలని డిజిపిని కోరుతూ మరో లేఖ రాశారు. పల్నాడు జిల్లాలో వైసిపి అరాచకానికి గురైన టిడిపి కారకర్తలకు అండగా ఉండేందుకు ప్రత్యేక కమిటీని చంద్రబాబు ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో వర్ల రామయ్య, నక్కా ఆనంద్‌బాబు, బొండా ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, లావు శ్రీకృష్ణదేవరాయలు, జంగా కృష్ణమూర్తి, జూలకంటి బ్రహ్మారెడ్డి ఉన్నారు.

➡️