ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో త్వరలో సాగునీటి, సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నారు. . పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులతో బుధవారం ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో కూడా టిడిపి కూటమి అభ్యర్థులే గెలుపొందేలా కృషి చేయాలని ఆయన కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఇప్పటికే 52.45 లక్షల మంది సభ్యత్వం తీసుకున్నారని ఆయన చప్పారు. ఇంత స్వల్ప కాలంలోనే ఇంతమంది చేరడం ఒక చర్తిర అని అన్నారు. గత ఎన్నికల పోలింగ్‌ళో రాజంపేట, కుప్పం, కళ్యాణదుర్గం, పాలకొల్లు, ఆత్మకూరు, మంగళగిరి, కనిగిరి, కోడూరు, వినుకొండ, కావలి నియోజకవర్గాలు మొదటి పది స్థానాల్లో నిలిచాయని అక్కడి నాయకత్వాన్ని అభినందించారు. సభ్యత్వాల నమోదుపై ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని లక్ష్యం దిశగా తీసుకెళ్తున్నారని మంత్రి లోకేష్‌ను అభినందించారు. తొలిసారిగా రూ.1లక్షతో తీసుకొచ్చిన శాశ్వత సభ్యత్వ విధానానికి కూడా అనూహ్యమైన స్పందన వస్తోందని చెప్పారు. గత ఐదేళ్లల్లో విచ్చలవిడితనంతో ఎక్కడికక్కడ భూ సమస్యలు సృష్టించారని, త్వరలోనే రెవెన్యూ సదస్సులు నిర్వహించి వీటిని పరిష్కరిస్తామన్నారు. రోడ్ల మరమ్మతులకు రూ.1400కోట్లు మంజూరు చేశామని, సంక్రాంతి నాటికి రాష్ట్రంలో ఎక్కడా రోడ్లపై గుంతల్లేకుండా చేస్తామని తెలిపారు.