దాడి కేసులో ‘బొండా’ను ఇరికించే యత్నం : చంద్రబాబు

Apr 17,2024 22:15 #Nara Chandrababu, #speech

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అధికార పార్టీ కుట్రలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రిపై రాయి దాడి విషయంలో తప్పుడు ప్రచారాలు, సింపతీ డ్రామాలతో వైసిపి అభాసుపాలైందని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నాలుగు రోజులు గడుస్తున్నా దీనిపై పోలీసు ఉన్నతాధికారులు స్పష్టమైన ప్రకటన చేయలేకపోయారని అన్నారు. వీళ్లే నిందితులు అంటూ వడ్డెర కాలనీకి చెందిన యువకులను, మైనర్లను పోలీసులు తీసుకుపోయారని పేర్కొన్నారు. దీనిపై ఆ కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను, టిడిపి ముఖ్యనేతలను కేసుల్లో ఇరికించాలనే పన్నాగంతో వైసిపి పావులు కదుపుతోందని, దీనికోసం నిందితులకు టిడిపి నేతలతో సంబంధాలున్నట్లు చిత్రీకరించేలా విశ్వప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. ఇందులో భాగంగా విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గ అభ్యర్థి బొండా ఉమను కేసులో ఇరికించేందుకు వైసిపి కుట్రలు చేస్తోందని ఆరోపించారు. అధికార పార్టీ ప్రలోభాలకు, ఒత్తిళ్లకు లోనై బొండా ఉమపై తప్పుడు కేసులు పెట్టినా, తప్పు చేసినా తమ ప్రభుత్వం రాగానే చాలా కఠినంగా శిక్షించబడతారని హెచ్చరించారు. ఎన్నికల సంఘం కూడా అధికార దుర్వినియోగంపై దృష్టి పెట్టాలన్నారు. ముఖ్యమంత్రికి భద్రతను కల్పించడంలో విఫలమైన అధికారులను విచారణ బాధ్యతల నుంచి తప్పించి, కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణతో వేరే అధికారులతో సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు.
ఇసికి టిడిపి లేఖ
తమ పార్టీ నేత బొండా ఉమామహేశ్వరరావుపై అక్రమ కేసులు పెట్టకుండా విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ను ఆదేశించాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌తోపాటు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా, డిజిపి రాజేంద్రనాథ్‌ రెడ్డికి టిడిపి లేఖలు రాసింది. ముఖ్యమంత్రిపై రాయి దాడికి సంబంధం లేకపోయినా తప్పుడు కేసు బనాయించి అరెస్టు చేసేందుకు పోలీసులు కుట్ర పన్నుతున్నారని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య పేర్కొన్నారు. రాయి దాడి కేసులో బొండా ఉమను ఇరికించేందుకు జగన్‌ కుట్ర పన్నారని టిడిపి నేతలు చినరాజప్ప, నిమ్మల రామానాయుడు ఒక ప్రకటనలో విమర్శించారు. ఓటమి భయంతో మరో బిసి బిడ్డను బలి చేసే కుట్రకు జగన్‌ ప్రయత్నిస్తున్నారని టిడిపి అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ టిడిపి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో చెప్పారు. జగన్‌ పాలన జంబో సలహాదారులతో సాగిందని టిడిపి అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్‌ అన్నారు. సిద్ధం సభలు వెలవెలబోతున్నాయని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు ఎంఎ షరీఫ్‌ అన్నారు.

➡️