అమిత్‌ షాకు చంద్రబాబు విందు

Jun 12,2024 09:57 #Amit Shah, #Chandrababu's, #Dinner

– ఇరువురు నేతల భేటీ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో
రాష్ట్రంలో నారా చంద్రబాబునాయుడు బుదవారం నాల్గవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో పలువురు ప్రముఖులు మంగళవారంనాడే విజయవాడకు చేరుకున్నారు. ఢిల్లీనుండి వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు దగ్గుపాటి పురందరేశ్వరి, హోంశాఖ సహాయ మంత్రి బండి సంజరు, టిడిపి జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్‌, బిజెపి నేతలు సిఎం రమేష్‌, సుజనా చౌదరి తదితరులు ఘనస్వాగతం పలికారు. రాష్ట్ర కేబినెట్‌లో బిజెపి నుండి ఎవరు వుండాలనే అంశంపై చర్చించేందుకు అమిత్‌షా విమానాశ్రయం నుండి నేరుగా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు. దాదాపు గంట పాటు ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం. అనంతరం చంద్రబాబు నివాసంలోనే అమిత్‌ షాకు విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజరు, బిజెపి జాతీయ అధ్యక్షులు జెపి నడ్డాతో పలువురు ఎన్‌డిఎ నేతలు పాల్గన్నట్లు తెలిసింది.
విజయవాడ చేరుకున్న చిరంజీవి ప్రభృతులు
విశిష్ట అతిథిగా హాజరుకానున్న ప్రముఖ నటుడు చిరంజీవి కూడా కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ నుండి విజయవాడకు చేరుకున్నారు. ఆయనతో పాటు చంద్రబాబు స్నేహితుడు, ప్రముఖ నటుడు రజనీకాంత్‌ విజయవాడ చేరుకున్నారు. ఢిల్లీ నుండి పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు విజయవాడకు చేరుకున్నారు. అలాగే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం, సింగపూర్‌, జపాన్‌, నెదర్లాండ్స్‌, దక్షిణకొరియా దేశాల కాన్సులేట్‌ నుండి ప్రతినిధులు మంగళవారం రాత్రే విజయవాడ విచ్చేశారు. అలాగే నారా, నందమూరి కుటుంబాల నుంచి పలువురు ఇప్పటికే చంద్రబాబు ఇంటికి చేరుకున్నారు.

➡️