విస్తృతంగా పింఛన్ల తనిఖీ : చంద్రబాబు ఆదేశం

స్థానిక సంస్థల్లో బిసిలకు 34శాతం రిజర్వేషన్లు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులకు ఇస్తున్న సామాజిక పింఛన్లను విస్తృంగా తనిఖీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. బిసి సంక్షేమశాఖపై సచివాలయంలో సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అనర్హులను తొలగించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగాలనిచెప్పారు. అర్హులైన వారికే సాయం అందాలన్నది తమ విధానమని, అందుకే తనిఖీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. దివ్యాంగుల పింఛన్ల తనిఖీ కార్యక్రమాన్ని మూడు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. తప్పుడు సర్టిఫికేట్లు ఇచ్చే డాక్టర్లు, అధికారులు, సిబ్బందిపై చర్యలకు వెనుకాడవద్దని అన్నారు. ఒకసారి తప్పుడు సర్టిఫికేట్‌ ఇస్తే ఎప్పుడైనా వారిపైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. తప్పుడు సర్టిఫికేట్లతో ప్రభుత్వాన్ని మోసం చేస్తే సహించేది లేదన్నారు. బిసిల రక్షణ చట్టం కోసం నియమించిన మంత్రుల కమిటీ ప్రాథమికంగా ఇచ్చిన సూచనలను అధికారులు ముఖ్యమంత్రికి ఈ సమావేశంలో వివరించారు. అనంతరం సిఎం మాట్లాడుతూ నామినేటెడ్‌ పోస్టుల్లో బిసిలకు 34శాతం రిజర్వేషన్లు ఇవ్వాలను హామీకి కట్టుబడి ఉన్నామని, దీనికి చట్టబద్దత కూడా చేస్తామని తెలిపారు. బిసి సంక్షేమ హాస్టళ్లకు తక్షణమే మరమ్మతులు చేయాలని ఆదేశించారు. రాష్ట్రవిభజన తరువాత ఉమ్మడి జిల్లాల ఆధారంగా మంజూరు చేసిన 13 బిసి భవనాల్లో మూడు మాత్రమే నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. మిగిలిన వాటికి భూసేకరణ పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి సామాజిక వర్గానికి కో-ఆపరేటివ్‌ ఫైనాన్స్‌ సొసైటీ ఏర్పాటు చేసి ఆయా వర్గాలను బలోపేతం చేసేందుకు పనిచేయాలని చెప్పారు. రాష్ట్రంలో త్వరలో ఎస్‌ఆర్‌ శంకరన్‌ నాలెడ్జ్‌ సెంటర్లను ప్రారంభించేందుకుఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. స్కిల్‌ ఎడ్యుకేషన్‌లో భాగంగా స్పోకెన్‌ ఇంగ్లీష్‌, సోషల్‌ ఎమోషనల్‌ స్కిల్స్‌, నైతిక విలువలు, నీతిశాస్త్రం, డిజిటల్‌ లిటరసీ, లీగల్‌ అవేరొస్‌ వంటివి ఈ సెంటర్ల ద్వారా విద్యార్ధులకు అందించాలని చెప్పారు. 26 జిల్లాల్లోని 104 బిసి హాస్టళ్లలో పైలట్‌ ప్రాజెక్టులుగా దీనినిఅమలు చేయనున్నారు. ఈ సమీక్షలో బిసి సంక్షేమ శాఖ మంత్రి సవిత, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి పాల్గొన్నారు.

➡️