ప్రజాశకి – అమరావతి బ్యూరో : చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందని, కూటమి మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశమేలేదని వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం పార్లమెంట్ నియోజకవర్గాల పార్టీ పరిశీలకులు,పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ కూటమి పాలనలో అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయని, విద్య, వ్యవసాయం, వైద్య రంగాలు నిర్వీర్యమయ్యాయన్నారు. విచ్చలవిడిగా అన్ని చోట్ల అవినీతి రాజ్యం ఏలుతోందని, ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి వరకు ముడుపులు తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు.నేతలెవరూ కేసులకు ఏ మాత్రం భయపడొద్దని, రాష్ట్రంలో చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయన్నారు. ప్రభుత్వ దుర్మార్గాలు చూసి తనలోనూ మార్పు వచ్చిందని జగన్ అన్నారు. జిల్లా నుంచి గ్రామ స్దాయి వరకు అన్ని కమిటీలు త్వరిత గతిన నియామకాలన్నీ పూర్తి కావాలన్నారు.
