పోలీసుల ఉదాసీనత వల్లే శాంతిభద్రతల సమస్యలు : చంద్రబాబు

May 16,2024 22:25 #chandrababau, #coments, #police, #TDP

ప్రజాశక్తి-అమరాతి బ్యూరో : వైసిపి మూకలు చేస్తున్న దాడుల విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడం వల్లే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పోలింగ్‌ అనంతరం వైసిపి రౌడీల దాడులను అదుపు చేయడంలో పోలీసులు విఫలమవుతున్నారని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పల్నాడులో ఇప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని, వైసిపి రౌడీ మూకలు ఇళ్లల్లో బాంబులు, మారణాయుధాలు పెట్టుకుని దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు. పోలీసులు పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించి గూండాలను అరెస్టు చేయాలని, మాచర్లలో మారణహోమానికి కారణమైన ఎమ్మెల్యే పిన్నెల్లిపై కేసులు పెట్టి వెంటనే అరెస్టు చేస్తే తప్ప అక్కడ దాడులు ఆగే పరిస్థితి లేదన్నారు. టిడిపికి ఓటు వేశారన్న కారణంతో నలుగురు మహిళలపై విశాఖలో దారుణంగా దాడి చేశారని ఆరోపించారు. అలాగే విజయవాడ భవానీపురంలో పోలింగ్‌ రోజు జరిగిన దాడి కేసులో నిందితుడు, వైసిపి నేత పోలీస్‌ స్టేషన్‌ నుంచి పారిపోవటం పోలీసుల ఉదాసీన వైఖరికి నిదర్శనమని చంద్రబాబు విమర్శించారు.

➡️