చంద్రబాబువే అసలైన డ్రామాలు

Apr 11,2025 21:24 #former minister Perni Nani

 మాజీ మంత్రి పేర్ని నాని
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్నప్పుడు చంద్రబాబు తనకు భద్రత కల్పించాలంటూ, ఆడినవే అసలైన డ్రామాలు అని మాజీ మంత్రి, వైసిపి నాయకులు పేర్ని నాని విమర్శించారు. రామగిరిలో జగన్‌కు భద్రతా వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘అవన్నీ అనంతపురం డ్రామాలు…’ అన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్‌కు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, దానిని విస్మరించడం వల్లే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు. రెక్కలు తిరుగుతుండగానే హెలికాఫ్టర్‌ వద్దకు జనం ఎలా వెళ్లారని, వారిని నియంత్రించాల్సిన బాధ్యత పోలీసులకు లేదా? అని ప్రశ్నించారు. వైసిపి మాజీ ఎమ్మెల్యే తొపుదుర్తి ప్రకాశ్‌ ఉద్దేశపూర్వకంగా జనాన్ని రెచ్చగొట్టి, డిఎస్‌పి నిలువరిస్తున్నా వినకుండా జనాన్ని ప్రోత్సహించి హెలికాఫ్టర్‌ విండ్‌ షీల్డ్‌ పగులకొట్టించారంటూ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, తప్పుడు కేసులు పెట్టారని చెప్పారు. రామగిరిలో హెలిప్యాడ్‌ రక్షణ కోసం వైసిపి కార్యకర్తలు రెండంచెల బారికేట్స్‌ కట్టుకున్నా, ఎఫ్‌ఐఆర్‌లో బారికేట్స్‌ లేవని రాసినట్లు తెలిపారు. జగన్‌కు భద్రతపై కేంద్రం బాధ్యత తీసుకోవాలని కోరారు. గనులశాఖ మంత్రి కొల్లు రవీంద్ర అవినీతికి అంతు లేకుండా పోతోందని, అందుకే ఒఎస్‌డిని ప్రభుత్వం తొలగించిందన్నారు. ఈ శాఖలో కీలకంగా ఉన్న మరో ఐఎఎస్‌ అధికారి సెలవుపై వెళ్లారని పేర్కొన్నారు.

➡️