నాలుగైదు స్థానాల్లో టిడిపి అభ్యర్థుల మార్పు?

Apr 21,2024 12:30 #Change, #TDP candidates

అమరావతి: టిడిపి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు కాసేపట్లో బీ-ఫారాలు అందజేయనున్నారు. నాలుగైదు స్థానాల అభ్యర్థిత్వాల్లో మార్పులు జరిగే అవకాశముంది. ఇప్పటికే దీనికి సంబంధించిన కసరత్తు పూర్తిచేసినట్లు సమాచారం. ఉండి, పాడేరు, మాడుగుల, మడకశిర, వెంకటగిరి అసెంబ్లీ స్థానాల్లో మార్పులు జరిగే వీలుంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, ఎంపీ రఘురామకృష్ణరాజు, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, ఎస్సీ సెల్‌ నేత ఎంఎస్‌ రాజు చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు.
ఉండి టికెట్‌ను రఘురామకృష్ణరాజుకు కేటాయించే అవకాశముంది. పెందుర్తి స్థానం జనసేనకు కేటాయించడంతో అక్కడ మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తికి అవకాశం లభించలేదు. దీంతో మాడుగుల స్థానాన్ని ఆయనకు ఇవ్వనున్నట్లు తెలిసింది. పాడేరు టికెట్‌ను మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి కేటాయించే అవకాశముంది. మడకశిర నుంచి ఎంఎస్‌ రాజు బరిలో నిలిచే వీలుంది. వెంకటగిరి స్థానాన్ని ఇదివరకు మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కుమార్తె లక్ష్మీప్రియకు ఖరారు చేశారు. మార్పుల్లో భాగంగా అక్కడి నుంచి రామకృష్ణనే అభ్యర్థిగా ప్రకటించనున్నారు.
దెందులూరు, తంబళ్లపల్లె అభ్యర్థుల బీ ఫారాలను పెండింగులో ఉంచే అవకాశముంది. అనపర్తి స్థానంపై స్పష్టత వచ్చాక ఆ రెండు స్థానాలకు బీ ఫారాలు ఇవ్వనున్నారు. అనపర్తి స్థానాన్ని భాజపాకు కేటాయించారు. అక్కడ టిడిపి టికెట్‌ ఆశించిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అదే స్థానం నుంచి బిజెపి తరఫున పోటీ చేసే అవకాశముంది.

➡️