విద్యావిధానంలో మార్పులు అవసరం

Aug 17,2024 23:05 #Changes, #education system, #needed
  • సౌత్‌ సెంట్రల్‌ జోన్‌ ఇన్సూరెన్స్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ అధ్యక్షులు పి సతీష్‌

ప్రజాశక్తి – కలెక్టరేట్‌ (విశాఖపట్నం) : ప్రభుత్వ కార్పొరేట్‌ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్మించి, ఉద్యోగాల సాధనకు విద్యార్థులు, యువకులు పోరాటాలు సాగించాలని సౌత్‌ సెంట్రల్‌ జోన్‌ ఇన్సూరెన్స్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ అధ్యక్షులు పి.సతీష్‌ పిలుపునిచ్చారు. ప్రభుత్వాల విధానాలు మారేలా పోరాటాలు సాగాల్సిన అవసరముందని పేర్కొన్నారు. ‘భారతదేశ నిరుద్యోగ సమస్య -కారణాలు – పరిష్కారం’ అనే అంశంపై విశాఖలోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌, డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో శనివారం సదస్సు జరిగింది. దీనికి ప్రధాన వక్తగా హాజరైన ఆయన మాట్లాడుతూ దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రమైందన్నారు. అవసరమైనన్ని ఉద్యోగాలు లేకపోవడం, విద్యార్హతలు ఉన్నా సరైన ఉద్యోగాలు లభించకపోవడం వంటివి అన్నిచోట్లా కనిపిస్తున్నాయని తెలిపారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వ, ప్రయివేటు రంగం కలిసి పనిచేయాల్సి ఉందన్నారు. విద్యావిధానంలో మార్పులు చేసి, నైపుణ్యాలను పెంపొందించడంపై దృష్టి పెట్టాలని కోరారు. మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత ఉద్యోగాల కల్పన మృగ్యమైందన్నారు. కార్పొరేట్‌ అనుకూల విధానాలే అమలవుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కార్పొరేట్‌ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలను నిర్మించాలన్నారు. ఐసిఇయు విశాఖపట్నం డివిజన్‌ అధ్యక్షులు ఎం.కామేశ్వరి మాట్లాడుతూ నైపుణ్యంతో కూడిన విద్య ఉంటే ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు. ఆ దిశగా పాలకులు పనిచేయటం లేదని విమర్శించారు. రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ కె.పద్మ మాట్లాడుతూ వికసిత్‌ భారత్‌ అంటూ పాలకులు మభ్యపెడుతున్నారని తెలిపారు. దేశంలో అసమానతలు పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశంలో ఐసిఇయు డివిజన్‌ ప్రధాన కార్యదర్శి జి.వరప్రసాద్‌, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కె.సంతోష్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎల్‌జె.నాయుడు, పెద్ద ఎత్తున విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు.

➡️