- అంగన్వాడీ యూనియన్ల డిమాండ్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : బాల సంజీవని 2.0 వెర్షన్‌లో మార్పులు చేయాలని, అంగన్వాడీ కేంద్రాలకు అందించాల్సిన పోషకాహారాన్ని సకాలంలో అందించాలని, పిల్లలకు మే నెలలో టేక్ హోమ్ రేషన్‌తో వేసవి సెలవులు ఇవ్వాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్లు డిమాండ్ చేశాయి. ఈ మేరకు ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) ప్రధాన కార్యదర్శి కె సుబ్బరావమ్మ, ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ (ఎఐటియుసి) ప్రధాన కార్యదర్శి లలితమ్మ, ఎపి ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్ యూనియన్ (ఐఎఫ్‌టియు) ప్రధాన కార్యదర్శి విఆర్ జ్యోతి సంయుక్తంగా మంగళవారం ప్రకటన విడుదల చేశారు. సెంటర్ల నిర్వహణకు బాల సంజీవని 2.0 వెర్షన్ యాప్‌ను ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఫొటోలు, ప్రీ స్కూల్ పిల్లల ఫోటోలను ఇన్ టైమ్‌లో అప్‌లోడ్ చేయడం, వారికి సంబంధించి మెనూను ఇన్‌టైమ్‌లో ఆన్‌లైన్ చేయాలని నిబంధనలు పెట్టడాన్ని అంగన్వాడీ యూని యన్లు వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం ఒక్క పూటే కేంద్రాలు నిర్వహిస్తుండటంతో 8 గంటలకే రావాలంటే పిల్లలు ఇబ్బందిపడే పరిస్థితి ఉందన్నారు. రైస్, దాల్, ఆయిల్, బాలామృతం, పాలు, గుడ్లు, సంపూర్ణ పోషణ కిట్లు సకాలంలో అంగన్వాడీ కేంద్రాలకు అందజేయాలని కోరారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అంగన్వాడీ చిన్నారులకు మే నెలంతా టేక్ హోమ్ రేషన్‌తో వేసవి సెలవులు ఇవ్వాలని ఈ సందర్భంగా యూనియన్ల నాయకులు డిమాండ్ చేశారు.