ఇంటర్‌ విద్యలో మార్పులు

 ఏప్రిల్‌లోనే అడ్మిషన్లు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఇంటర్మీడియట్‌ విద్యలో పలు కీలక మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ ఆధ్వర్యంలో బోర్డు సమావేశం అసెంబ్లీలోని మంత్రి కార్యాలయంలో గురువారం జరిగింది. ఈ సమావేశంలో ఏప్రిల్‌ నుంచే అడ్మిషన్లు ప్రారంభించాలని నిర్ణయించారు. దీంతో 2025-26 విద్యాసంవత్సరం నుంచి జూన్‌ 1వ తేదికి బదులుగా ఏప్రిల్‌ 1వ తేదీ నుంచే ప్రభుత్వ కళాశాలలు ప్రారంభం కానున్నాయి. 2026లో పబ్లిక్‌ పరీక్షలు ఫిబ్రవరిలో, ప్రధమ సంవత్సరం అడ్మిషన్లు ఏప్రిల్‌ 7వ తేదీ నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. వచ్చే సంవత్సరం నుంచి ఎలక్టివ్‌ సబ్జెక్టులను 2వ సబ్జెక్టుగా ప్రవేశపెట్టనున్నారు. మ్యాథ్స్‌, బయాలజీ సబ్జెక్టులు అంతర్భాగాలుగా 6 సబ్జెక్టులతో ఎంబైపిసి కోర్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఎంపిసిలో రెండు సబ్జెక్టులుగా ఉన్న మ్యాథ్స్‌ను, బైపిసిలో రెండుగా ఉన్న బొటానీ, జువాలజీలను ఒకే సబ్జెక్టుగా విలీనం చేయనున్నారు. పోటీ పరీక్షల కోసం ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు మెటీరియల్‌ను ఇంటర్మీడియట్‌ బోర్డు తయారు చేయనుంది. ఈ సమావేశంలో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి కోన శశిధర్‌, కళాశాల, ఇంటర్మీడియట్‌, పాఠశాల విద్యల డైరెక్టర్లు నారాయణ భరత్‌ గుప్తా, కృతికా శుక్లా, విజయరామరాజు, సమగ్ర శిక్ష డైరెక్టర్‌ బి శ్రీనివాసరావు, స్కిల్‌డెవలప్‌మెంట్‌ డైరెక్టర్‌ జి గణేష్‌కుమార్‌, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ మధుమూర్తి, సెకండరీ విద్య కార్యదర్శి శ్రీనివాసులు రెడ్డి, ఓపెన్‌ స్కూల్స్‌ కార్యదర్శి నరసింహారావు, ఆంధ్రా, పద్మావతి, ఎన్‌జి రంగా, ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీల విసిలు జివి రాజశేఖర్‌, ఉమ, శారద రాజ్యలక్ష్మీదేవి, డిఎస్‌విఎల్‌ నరసింహం తదితరులు పాల్గొన్నారు.

➡️