పాఠశాల క్లస్టర్లలో మార్పులు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పాఠశాల కాంప్లెక్స్‌ (క్లస్టర్‌) విధానంలో రాష్ట్రప్రభుత్వం మార్పులు చేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌ శనివారం విడుదల చేశారు. ఇటీవల జిఓ 177ను రద్దు చేసిన నేపథ్యంలో పునర్‌ వ్యవస్థీకరణ పేరుతో మార్పులు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే కాంప్లెక్స్‌లో కూడా మార్పులు తీసుకొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 4,034 క్లస్టర్లు ఉంటాయని పేర్కొంది. వీటిల్లో 2,809 ఎ, 1,225 బి క్లస్టర్లు ఉంటాయని వివరించింది. ఉన్నత పాఠశాలను ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేస్తారు. వీటికి దగ్గరలో ఉన్న పాఠశాలలను అనుసంధానిస్తారు. ప్రతి క్లస్టర్‌లో 40-50 మంది ఉపాధ్యాయులు, 800-1000 వరకు విద్యార్థులు ఉంటారని తెలిపింది. గ్రామీణ ప్రాంతంలో 10-15 పాఠశాలలను 10-15 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేస్తారు. పట్టణ పరిధిలో 10-15 పాఠశాలలను 5-10 కిలోమీటర్ల పరిధికి ఒకటి ఏర్పాటు చేస్తారు. అన్ని ప్రభుత్వ, స్థానిక, రెసిడెన్షియల్‌ తదితర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే పాఠశాలలను ఈ క్లస్టర్లకు అనుసంధానం చేస్తారు.

➡️