సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో మార్పులు

ఉత్తర్వులు జారీ
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో కీలకమార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు సబ్‌ రిజిస్ట్రార్‌ కూర్చొనేందుకు న్యాయమూర్తుల తరహాలో ప్రత్యేకంగా ఉండే ఎత్తైన పోడియం, ప్రత్యేక కుర్చి, అడ్డుగా ఉండే ఎర్రని వస్త్రం వంటి వాటికి చెల్లుచీటి పలుకుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌ పి సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ప్రజలతో స్నేహపూర్వకంగా ఉండేలా పనిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
వరుసగా మూడు రోజులు సెలవుదినాలు కావడంతో మంగళవారం నాటికి పూర్తిగా రూపు రేఖలు మారే విథంగా స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ కమిషనరు శేషగిరిరావు చర్యలు చేపట్టారు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో సిబ్బంది ప్రజలతో స్నేహ పూర్వకంగా మెలగడంతో పాటు కార్యాలయానికి వచ్చే వారు కూర్చునేందుకు వీలుగా సబ్‌ రిజిస్ట్రార్లకు ముందు మూడు కుర్చీలు వేయాలని కూడా ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

➡️