- అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ డిమాండ్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అంగన్‌వాడీలకు ఇబ్బందికరమైన బాలసంజీవని యాప్‌లో మార్పులు చేయాలని ఆంధ్రప్రదేశ్ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. యూనియన్ రాష్ట్ర కమిటీ సమావేశం విజయవాడలోని ఎంబి విజ్ఞాన కేంద్రంలో బుధవారం జరిగింది. సంజీవని యాప్‌లను 7 నెలల నుంచి మూడేళ్లలోపు పిల్లలకు ఫొటో క్యాప్చర్ తీసేయాలని యూనియన్ ప్రధాన కార్యదర్శి కె సుబ్బరావమ్మ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రీస్కూల్ పిల్లలకు ఫొటో ఆధారంగా రేషన్ ఇవ్వాలనే నిబంధనలు తొలగించాలని, వర్కర్, హెల్పర్, మినీవర్క్‌లకు ఫేస్‌యాప్ ఇన్, ఔట్ లోకేషన్ తీసివేయాలని, లబ్ధిదారులకు అందిస్తున్న సరుకులన్నీ ఒకేసారి వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సమావేశం కోరింది. సెంటర్ నిర్వహణకు ట్యాబ్ ఇవ్వాలని, మే నుంచి అంగన్‌వాడీ సెంటర్లకు వేసవి సెలవులు ప్రకటించాలనే ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సమస్యలపై అన్ని స్థాయిల్లో ఐసిడిఎస్ ఉన్నతాధికారులకు, పిడి, సిడిపివోలకు వినతిపత్రాలు ఇవ్వాలని నిర్ణయించింది. లబ్ధిదారులకు ఒటిపిని రద్దు చేసి వారితోనే వినతిపత్రాలు ఇప్పించాలని తీర్మానించింది. అంగన్‌వాడీలకు వేతనాలు పెంచాలని, మినీల జిఓ వెంటనే ఇవ్వాలని పేర్కొంది. సమస్యల పరిష్కారం కోసం మే 20న రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేయాలని నిర్ణయించింది.
బానిసలుగా చేసే ప్రయత్నం : సిహెచ్ నర్సింగరావు
కేంద్ర ప్రభుత్వం.. కార్మికులను యాజమానులకు కట్టుబానిసలుగా చేసేందుకు ప్రయత్నిస్తోందని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నర్సింగరావు విమర్శించారు. రక్తం చిందించి కార్మికులు 8 గంటల పని హక్కును సాధించుకున్నారని తెలిపారు.
దీనిని 12-15 గంటలుగా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మిక కోడ్స్, ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా మే 20న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్రంలోనూ అన్ని కార్మిక సంఘాలు కలిసి చేసే సమ్మెలో అంగన్‌వాడీలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో యూనియన్ రాష్ట్ర నాయకులు సిహెచ్ సుప్రజ, లకీëదేవి, కృష్ణవేణి, చంద్రావతి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.