ఇసుక విధానంలో మార్పులు

  • స్థానిక అవసరాలకు ట్రాక్టర్లలో ఉచితం

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఇసుక విధానంలో రాష్ట్ర ప్రభుత్వం స్వల్ప మార్పులు చేసింది. ఇసుకరీచ్‌ల నుంచి స్ధానిక అవసరాలకు ట్రాక్టర్లలో ఉచితంగా ఇసుక తీసుకెళ్లేందుకు తాజాగా అనుమతినిచ్చింది. ఈ మేరకు గనులశాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్‌కుమార్‌ మీనా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సిఎం చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ట్రాక్టర్లలోనూ ఇసుకను ఉచితంగా తరలించే అవకాశాన్ని కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఎడ్ల బండికి మాత్రమే ఉచితంగా ఇసుక తరలింపునకు అనుమతి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనులకు ఇసుక కొరత లేకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మీనా పేర్కొన్నారు. స్దానిక అవసరాలకు సమీపంలోని వాగుల నుంచి ఇసుకను ఉచితంగా తీసుకెళ్లవచ్చని, అవసరమైన వారు ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లలోనూ రవాణా చేసుకోవచ్చని ఆయన తెలిపారు.

➡️