- అనంతపురం జిల్లా హనకనహాల్‌లో ఘటన
ప్రజాశక్తి -కణేకల్లు : అనంతపురం జిల్లా కణేకల్లు మండలం హనకనహాల్ గ్రామంలో సోమవారం అర్ధరాత్రి రామాలయ రథానికి మంటలు వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన గ్రామస్తులు వెంటనే మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో రథం పాక్షికంగా దెబ్బతిన్నది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హనకనహాల్ గ్రామ రామాలయం వద్ద రథాన్ని ఉంచేందుకు ప్రత్యేకంగా ఓ షెడ్డును ఏర్పాటు చేసి అందులో ఉంచారు. సోమవారం అర్థరాత్రి రథానికి మంటలు వ్యాపించాయి. గ్రామస్తులు గమనించి మంటలు ఆర్పివేశారు. అప్పటికే రథం ముందుభాగం కొంత కాలిపోయింది. గ్రామంలో అలజడి సృష్టించేందుకే రథానికి నిప్పుపెట్టారా..? లేక ప్రమాదవశాత్తు ఘటన జరిగిందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కలెక్టర్, ఎస్‌పి పరిశీలన
విషయం తెలుసుకున్న కలెక్టర్ వినోద్‌కుమార్, ఎస్‌పి జగదీష్, కళ్యాణదుర్గం డిఎస్‌పి రవిబాబు, ఆర్‌డిఒ రాణి సుస్మిత, రూరల్ సిఐ వెంకటరమణ, ఎస్‌ఐ నాగమధు తహశీల్దార్ ఫణి కుమార్ హనకనహాల్ గ్రామంలో పర్యటించారు. నిప్పుపెట్టిన రథాన్ని పరిశీలించారు. ఘటనకు సంబంధించి వివరాలను సేకరించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ.. రథానికి నిప్పుపెట్టిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. నిందితులను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, త్వరలోనే వారిని అరెస్టు చేస్తామని చెప్పారు.
నిందితులను శిక్షించాలి : సిపిఎం
ఈ సంఘటనపై సమగ్ర విచారణ చేసి, నిందితులను శిక్షించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.రాంభూపాల్ ఓ ప్రకటనలో కోరారు. రథం కాలిపోయిన ఘటనలో ఎలాంటి రాజకీయ కారణాలు లేవని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలిపారు.