మంగళగిరి : వైసిపి అధినేత వైఎస్.జగన్ భార్య వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టిడిపి కార్యకర్త చేబ్రోలు కిరణ్‌ను పోలీసులు మంగళగిరి న్యాయస్థానంలో హాజరుపరిచారు. ముందుగా మంగళగిరి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో అతడికి ప్రభుత్వ వైద్యులతో పరీక్షలు నిర్వహించారు. అనంతరం భారీ పోలీసు బందోబస్తు మధ్య కోర్టుకి తరలించారు. డీఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో సుమారు 100 మంది పోలీసులు న్యాయస్థానం వద్ద మోహరించారు. ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో వై.ఎస్.భారతిని ఉద్దేశించి కిరణ్ చేసిన అసభ్య వ్యాఖ్యలను టిడిపి అధిష్ఠానం తీవ్రంగా పరిగణించింది. అతడిని తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. ఆ వెంటనే మంగళగిరి రూరల్ పోలీసుస్టేషన్‌లో కిరణ్‌పై బెయిల్‌కు వీల్లేని కఠిన సెక్షన్ల కింద కేసు నమోదైంది. రంగంలోకి దిగిన పోలీసులు సెల్‌ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా విజయవాడ-ఇబ్రహీంపట్నం మధ్యలో కిరణ్‌కుమార్ ఉన్నట్లు గుర్తించి గురువారం అరెస్ట్ చేశారు.
