వైఎస్‌ భారతిపై అనుచిత వ్యాఖ్యలు

  • టిడిపి కార్యకర్త చేబ్రోలు కిరణ్‌ అరెస్టు
  • పార్టీ నుంచి సస్పెండ్‌ చేసిన అధిష్టానం

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సతీమణి భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టిడిపి ఐటి విభాగం కార్యకర్త చేబ్రోలు కిరణ్‌కుమార్‌ను మంగళగిరి రూరల్‌ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. గుంటూరు రామన్నపేటకు చెందిన కిరణ్‌కుమార్‌ ఓ యూట్యూబ్‌ ఛానల్‌లో భారతి గురించి తీవ్ర అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని జిల్లా ఎస్‌పి సతీష్‌కుమార్‌ తెలిపారు. ఈ అంశంపై ఫిర్యాదు అందిన వెంటనే ఆయనను ఎన్‌టిఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. శుక్రవారం కిరణ్‌ను కోర్టులో హాజరుపరుస్తామని వెల్లడించారు. గతంలో మాజీ మంత్రి విడదల రజనీపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడంతోపాటు పలువురిపై పోస్టింగ్‌లు పెట్టిన ఘటనలలో కిరణ్‌కుమార్‌పై ఐదు కేసులు ఉన్నాయని ఎస్‌పి తెలిపారు. అలాగే ఇటీవల పవన్‌ కల్యాణ్‌ చిన్న కుమారుడు శంకర్‌పైనా కొంతమంది అసభ్యకరమైన పోస్టులు పెట్టారని, దీనిపై ప్రత్తిపాడు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు అయ్యిందని ఆయన వెల్లడించారు. వీరిని కూడా త్వరలో అరెస్టు చేస్తామని తెలిపారు. మహిళలు, చిన్నారులపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన పోస్టులు, వ్యక్తిగత దూషణలు చేస్తే తగిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అంతకుముందు టిడిపి అధిష్టానం చేబ్రోలు కిరణ్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళలపై అసభ్యంగా మాట్లాడడం తమ పార్టీ విధానం కాదని తెలిపింది. పార్టీ నుంచి కిరణ్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్టు పార్టీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

మాజీ ఎంపి గోరంట్ల మాధవ్‌ అరెస్టు

చేబ్రోలు కిరణ్‌ను పోలీసులు అరెస్టు చేసి గుంటూరు ఎస్‌పి ఆఫీసుకు తరలిస్తుండగా.. మాజీ ఎంపి గోరంట్ల మాధవ్‌ పోలీసు వాహనాన్ని అడ్డుకున్నారు. తమ విధులకు ఆటంకం కలిగించారని గోరంట్ల మాధవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని నగరంపాలెం పోలీసు స్టేషన్‌కు తరలించారు. విధులకు ఆటంకం కలిగించారన్న అభియోగంపై కేసు నమోదు చేశారు.

➡️