కమిషనర్ పి.ఆనంద్‌కుమార్
ప్రజాశక్తి – గ్రేటర్ విశాఖ బ్యూరో : జిఎస్‌టి అమలుతో పన్ను ఎగవేతదారులు తప్పించుకోలేని పరిస్థితులు దేశంలో నెలకొన్నాయని సిజిఎస్‌టి కమిషనర్ (ఆడిట్) పి.ఆనంద్ కుమార్ అన్నారు. విశాఖలోని పోర్టు ట్రస్ట్ సీ హార్స్ జంక్షన్ వద్దగల జిఎస్‌టి భవన్‌లో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టుకు నిధులు జిఎస్‌టి పక్కా అమలుతో సమకూరుతాయని తెలిపారు. జిఎస్‌టి వసూలు చేస్తున్న సందర్భంలో కొన్ని నకిలీ ఇన్వాయిస్‌లనూ పట్టుకుంటున్నామన్నారు. ఈ ఏడాది రూ.1500 కోట్లు నకిలీ ఇన్వాయిస్‌లను గుర్తించగా రూ.250 కోట్లను ఇప్పటి వరకూ వసూలు చేశామని తెలిపారు. జిఎస్‌టి కౌన్సిల్‌లో ధరల రేషనలైజేషన్‌పై చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే జిఎస్‌టి రేట్లు, పన్నుల స్లాబుల రేట్లు తగ్గే అవకాశం ఉందన్నారు. మన రాష్ట్రంలో సిజిఎస్‌టిలో ఐదు సర్కిళ్లు ఉన్నాయని, వాటిలో 28 గ్రూపుల ద్వారా 2024-25లో ఆడిట్ ద్వారా రూ.150 కోట్లు ఆదాయం తెచ్చామని తెలిపారు. రాష్ట్రంలో సుమారు 60 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు ఉన్నారన్నారు. రాష్ట్రంలో అత్యధికంగా కియా మోటార్స్ ద్వారా, విశాఖలో ఆటోమొబైల్ ఇండిస్టీ ద్వారా జిఎస్‌టి చేకూరుతోందని తెలిపారు. మరో ఏడాదిలో విశాఖలోని సిజిఎస్‌టి భవన్‌ను అమరావతికి ప్రభుత్వం తరలిస్తుందని వెల్లడించారు. ఈ సమావేశంలో జిఎస్‌టి అధికారులు అరవింద్ దాస్, సత్యనారాయణ, రవి కిరణ్, వెంపర్ల శ్రీనివాస్ పాల్గన్నారు.
